మాకు అవకాశమొచ్చింది అంతే, మీ పన్నులే ఆదాయం.. కట్టకుంటే ఎలా: ప్రజలకు బాబు క్లాస్!
ఒంగోలు: మేం కూడా మీలాగే సాధారణ కుటుంబంలో పుట్టామని, మాకు అవకాశాలు వచ్చాయని, అందుకే ఇక్కడ (ముఖ్యమంత్రి, ఇతర అధికార స్థానాల్లో) ఉన్నామని, మా కంటే ఇక్కడ కూర్చున్న (సభికులను ఉద్దేశించి) వారిలో చాలామంచి ఆలోచనలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలంలోని రాయవరంలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి అందరూ చేయూత ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేశామన్నారు. నాగరికతకు చిహ్నం మరుగుదొడ్లు అన్నారు. ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. చాలామంది సెల్ ఫోన్లు కొనుక్కుంటున్నారు కానీ మరుగుదొడ్లు కట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళిక ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతామన్నారు. అందరూ డబ్బులు సంపాదించే మార్గం ఆలోచించాలని సూచించారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే నాలుగైదు లక్షల ఎకరాలకు నీరు వస్తుందన్నారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. ఏ జిల్లాలో లేని భూమి ఇక్కడ ఉందని కానీ నీళ్లు లేవన్నారు. ఒకప్పుడు ఊట చెరువులు, కాలువలు ఉండేవని, ఇప్పుడు అవి లేవన్నారు. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉందన్నారు. మనకు అనేక వనరులు ఉన్నాయన్నారు. సమర్థులైన ప్రజలు కూడా ఉన్నారన్నారు.
కానీ విధానపరమైన లోపాల వల్ల వెనుకబడ్డామన్నారు. అన్నీ సరిదిద్దుకొని అభివృద్ధి చెందుతామన్నారు. ఫ్లోరైట్ నీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. మనం వనరులు ఉపయోగించుకుంటే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఎన్ని కోట్లు ఖర్చయినా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.
మేం కూడా సాధారణ కుటుంబంలో పుట్టామని, తమకు అవకాశాలు వచ్చాయి కాబట్టి ఇక్కడ కూర్చున్నామని, మా కంటే ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంచి ఆలోచనలు ఉన్నాయని, వాటితో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా చేయవచ్చునన్నారు.
కుటుంబం కోసం సంపాదన ముఖ్యమని చంద్రబాబు యువతకు హితవు పలికారు. కుటుంబం కోసం ఆదాయ మార్గాలు వెతకాలన్నారు.
సరైన ఆదాయ వనరులు, నిధులులేని ఏపీకి ప్రజలు కట్టే పన్నులే ఆదాయమని, అటువంటిది పన్నులు చెల్లించడంలో అలక్ష్యం వహిస్తే ఎలాగని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా నుంచి పన్నుల రాబడి తక్కువగా ఉందని ఆయన అన్నారు. పన్నులు కట్టాలని ప్రజలకు ఒకవిధంగా క్లాస్ పీకారని చెప్పవచ్చు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలన్నారు.












Click it and Unblock the Notifications