అఖిల పక్షానికి ఆహ్వానించలేదంటూ...సిఎంవో ఎదుట విద్యార్థి జేఏసీ ఆందోళన
అమరావతి: ఏపీ హక్కుల కోసం కేంద్రంపై సమైక్య పోరాటం కోసం సిఎం చంద్రబాబు సచివాలయంలో ఏర్పాటు చేసిన అఖిల ఫక్షాల సమావేశం ప్రారంభమైంది.
అయితే ఈ సమావేశానికి తమని ఆహ్వానించలేదంటూ సీఎం కార్యాలయం ఎదుట నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధులు ఆందోళన దిగడం ఉద్రిక్తతకు దారితీసింది.
సిఎంతో సమావేశానికి తమని కూడా అనుమతించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పాటు నినాదాలు చేస్తుండటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.
ఆహ్వానం లేనందున సమావేశానికి పంపడం కుదరదని, ఆదేశాలు వస్తే లోపలకు పంపండం జరుగుతుందని, అప్పటివరకు ఇక్కడ ఉండరాదంటూ విద్యార్థి జెఎసి ప్రతినిధులను సచివాలయం ప్రాంగణం నుంచి బైటకు పంపించివేశారు.

మరోవైపు ఈ సమావేశానికి హాజరయ్యేందుకు విచ్చేసిన ఏపీ ఎన్జీవో సంఘం నేత అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ...ఇప్పుడు పోరాటం చేయకపోతే నష్టం జరిగేది రాష్ట్రానికేనని, అలాగని ఉద్యోగాలు మాని ఉద్యమం కోసం రోడ్లపైకి వస్తే నష్టం జరిగేది కూడా రాష్ట్రానికే నని కేంద్రానికి కాదని అన్నారు. అయితే అఖిలపక్ష సమావేశంలో తమ ఎజెండా ఏమిటనేది స్పష్టంగా తెలియజేస్తామన్నారు. అలాగే అఖిలపక్ష నిర్ణయాన్నిబట్టి పోరాటం కొనసాగిస్తామని అశోక్‌బాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications