దేశభక్తితో కాదు: జగన్‌పై పవన్, మండిపడ్డ చంద్రబాబు
గుంటూరు/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెయిల్ కోసమే జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతంటున్నారని విమర్శించారు. సోమవారం ఆయన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2009లోనూ తమ ఒత్తిడి వల్లే కేంద్రం రైతుల రుణమాఫీ చేసిందన్న చంద్రబాబు, రుణమాఫీ ఎలా చేయాలో చేసి చూపిస్తామని అన్నారు. రైతుల రుణమాఫీ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన బాధేంటో అర్థం కావడం లేదన్నారు. ఆయన(జగన్) లక్ష కోట్లు దోచుకుంటే లేనిది రుణమాఫీ చేస్తానంటే బాధెందుకని చంద్రబాబు విమర్శించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఇబ్బందుల్లో ఉన్న ఈ తరుణంలో సరైన ప్రభుత్వాన్ని ఎంచుకోవడం ప్రజల బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని ఆరోపించారు. ధరలు పెరిగి, ఉద్యోగాలు తగ్గాయని అన్నారు. కాంగ్రెస్ పాలనలో డ్వాక్రా సంఘాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసి, తెలుగింటి ఆడపడుచుల రుణం తీర్చుకుంటానని చంద్రబాబు అన్నారు.
జైలు కెళ్లింది దేశభక్తితో కాదు: జగన్‌పై పవన్
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశభక్తితో పోరాటం చేసి జైలుకు వెళ్లలేదని, వేల కోట్ల ఆస్తులు దోచుకుని జైలుకు వెళ్లాడని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు సీమాంధ్ర ప్రజలను అవమానిస్తుంటే పల్లెత్తు మాట అనని జగన్మోహన్ రెడ్డి, ఎప్పటికీ సీమాంధ్ర ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. రాయలసీమ పచ్చగా కళకళలాడాలన్నదే తన ఆకాంక్ష అని, టిడిపి అధికారంలోకి వస్తేనే అధి సాధ్యమవుతుందని పవన్ కళ్యాన్ చెప్పారు. చంద్రబాబుకు అధికారమిస్తేనే రాయలసీమ మళ్లీ రతనాల సీమ అవుతుందని పవన్ అన్నారు.












Click it and Unblock the Notifications