రఘురామను ఆకాశానికెత్తేసిన చంద్రబాబు, పవన్-ఏమన్నారంటే ?
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో ఆయన చేసిన పోరాటం, ఎంపీ నుంచి డిప్యూటీ స్పీకర్ వరకూ సాగిన ఆయన ప్రయాణంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ ప్రసంగాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు నాటు పాటలా రఘురామ కూడా హిట్ కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

రఘురామ రాజు ఏదైనా ఫ్రాంక్‌గా మాట్లాడుతారని, కల్మషం ఉండదని చంద్రబాబు తెలిపారు. ఆయన ముందు, వెనుక చూడకుండా మాట్లాడుతారని, ఎక్కడైనా తప్పులు ఉన్నప్పడు కుండబద్దలు కొట్టినట్టు చెబుతారన్నారు. అదే రఘరామకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్నారు. అధినేత నిర్ణయాలతో విభేదించినప్పుడు కావాలంటే పార్టీకి దూరంగా ఉంటారని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిణామాల్ని కూడా చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్రంలో ఓ అధికార పార్టీ ఎంపీని కస్టడీలో పెట్టి టార్చర్ చేశారని, ఆ ఘటన అదే తొలిసారి, చివరి సారి కూడా కావాలన్నారు. రఘురామది దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రఘురామపై ప్రశంసల జల్లు కురిపించారు. తాను రీల్ హీరోనని, కానీ రఘురామ రియల్ హీరో అని ఆయన పోరాటాన్ని గుర్తుచేస్తూ పవన్ తెలిపారు. దెబ్బలు తిన్నా, చంపుతామని బెదిరించినా, ధైర్యంతో నిలబడ్డ రఘురామ రియల్ లైఫ్ లో హీరో అన్నారు. రఘురామను శారీరకంగా మానసికంగా వేధించారని, మిమ్మల్ని అడుగుపెట్టనీయమని ఛాలెంజ్ చేసినవాళ్లు ఇప్పుడు అడుగుపెట్టలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇదే కర్మ అంటే అన్నారు. డిప్యూటీ స్పీకర్ గా సహనం కోల్పోకుండా సభా గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రఘురామకు సూచించారు.












Click it and Unblock the Notifications