వైఎస్సార్ కడపకాదు.. కడప జిల్లానే! అమరావతి వేడుక... బాబు మార్కెటింగ్ ప్లాన్
విజయవాడ: వైయస్సార్ కడప జిల్లా పేరును కడపగానే ఉంచాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. అయితే, దీని పైన ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనిపై శనివారం నాటి కేబినెట్ భేటీలో చర్చ జరిగింది.
వైఎస్సార్ కడప జిల్లా పేరును తిరిగి కడప జిల్లాగా మార్చాలని మంత్రి అచ్చెన్నాయుడు లేవనెత్తారు. దేవుని గడప పేరుతో కడప అనే పేరు వచ్చిందని, దేవుడి పేరున ఏర్పడిన జిల్లా పేరును వైయస్సార్ కడప జిల్లాగా మార్చడం సరికాదన్నారు.
అయితే దీనిపై ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇసుక విధానంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని కొందరు మంత్రులు ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

పట్టిసీమ నీటిని విడుదల చేయడం ప్రారంభించామని, తమ్మిలేరు వద్ద గండిపూడ్చివేత పనులు పూర్తయ్యేసరికి ఈ నీరు అక్కడికి చేరుతుందని వివరించారు. రాజధాని శంకుస్థాపనకు అక్టోబర్ 22వ తేదీ 12.45 నిమిషాలకు మంచి ముహూర్తమని, ప్రధాని మోడీ కూడా అదే సమయానికి వచ్చేందుకు అంగీకరించారని చంద్రబాబు చెప్పారు.
జర్మనీ నుంచి ఇసుకి తకాడి, మితి అనే ఇద్దరు మంత్రులు, సింగపూర్ నుంచి ఈశ్వరన్‌తో పాటు మరో మంత్రి వస్తున్నారన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని అందరినీ ఆకట్టుకునేలా, మార్కెటింగ్ చేసుకునేలాను నిర్వహిస్తామన్నారు. అదే సమయంలో ఖర్చు తక్కువయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
శంకుస్థాపన ఏర్పాట్లలో భాగంగా అవసరమైన రోడ్లు కూడా మాస్టర్‌ప్లాన్‌ను అనుసరించే నిర్మిస్తామన్నారు. మన మట్టి మన నీరు కింద రాష్ట్రంలోని 13000 గ్రామాలు, మరో 3000 వార్డుల నుంచి మట్టి, నీరును పవిత్ర భావంతో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ఒక పవిత్రయాత్రలా అమరావతికి తీసుకువస్తామన్నారు.

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు, మసీదులు, చర్చిల నుంచి కూడా నీరు, మట్టి ఇలా తీసుకువచ్చి ఈ యజ్ఞంలో ఉపయోగిస్తామన్నారు. గ్రామాల నుంచి మండలానికి, మండలం నుంచి నియోజకవర్గానికి అక్కడి నుంచి జిల్లా కేంద్రాల మీదుగా అమరావతిలోని నాగార్జున విశ్వవిద్యాలయానికి తీసుకువస్తారన్నారు. వాటన్నింటినీ ప్రజల సంకల్పబలం పేరుతో రాజధాని నిర్మాణంలో వాడతామన్నారు.
ఈ కార్యక్రమంలో తాను కూడా తన నియోజకవర్గంలో లేదా, తన గ్రామంలో ఎక్కడో అక్కడ పాల్గొనాలని భావిస్తున్నానని ప్రకటించారు. పవిత్ర, సంప్రదాయ ఉత్సవంగా ప్రజలంతా ఇందులో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి అమరావతి ఆలయం నుంచి, అమరావతిలోని ఆలయం నుంచి జ్యోతినికూడా తీసుకువస్తామన్నారు.
కాగా, మంత్రివర్గ సమావేశంలో శనివారం పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చడం జేగురుపాడులోని తొలి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు జీవీకకు అవుట్ నోటీసు ఇచ్చి వెనక్కి తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కృష్ణపట్నం పోర్టు రైల్వే లైను కోసం తొమ్మిది ఎకరాలు రైల్వేకు ఇచ్చేలా ఆమోదం తెలిపింది.ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని కోట మండలంలో 852 ఎకరాలు ఏపీఐఐసీకి ఇచ్చేందుకు నిర్ణయించింది.












Click it and Unblock the Notifications