అమరావతి కోసం శ్రీవారికి బాబు వేడుకోలు!, 4గురు మంత్రులపై వేటు? (పిక్చర్స్)
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఏ ఆటంకాలు లేకుండా జరగాలని తాను శ్రీవారిని ప్రార్థించానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం చెప్పారు. తన మనవడు దేవాన్ష్‌కు అన్నప్రాసన అనంతరం ఆయన మాట్లాడారు.
ప్రజా రాజధాని కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతో శంకుస్థాపన చేస్తున్నామన్నారు. అందుకే ఇక్కడ ఏడు పవిత్ర జలాలను తీసుకొని స్వామివారి పాదాల వద్ద పెట్టి పూజ నిర్వహించామన్నారు. అమరావతి శంకుస్థాపన కోసం ఏడు కొండల నుంచి మట్టి సేకరించామన్నారు.

పవిత్ర జలాలు, మట్టిని తీసుకున్నామని చెప్పారు. నవరత్రాలు కూడా శ్రీవారి కాళ్ల వద్ద పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి తీసుకు వెళ్తున్నామన్నారు. అమరావతి నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామివారి ఆశీస్సులతో సజావుగా జరగాలన్నారు.
శంకుస్థాపన కూడా చక్కగా జరగాలని శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు. స్వామివారి పాదాల వద్ద ఆహ్వాన పత్రికను ఉంచి, తర్వాత హుండీలో వేశానని చంద్రబాబు చెప్పారు. మిగిలిన ఆహ్వాన పత్రాలు కూడా స్వామివారి పాదల వద్ద ఉంచి తీసుకెళ్తున్నామన్నారు.

నలుగురు మంత్రులపై వేటు పడే అవకాశం?
అమరావతి శంకుస్థాపన తర్వాత ఏపీ కేబినెట్‌లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేబినెట్‌ను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గత ఏడాదిన్నర నుంచి మంత్రుల పనితీరుపై అనేక రిపోర్టులను చంద్రబాబు తెప్పించుకున్నారు.

ఈ క్రమంలో కనీసం నలుగురు మంత్రులపై వేటు పడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, కేబినెట్‌లోకి పలువురు కీలక నేతలు రానున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు, స్పీకర్ కోడెల శివప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితరులకు కేబినెట్‌లో బెర్త్ దక్కొచ్చు.కోడెల స్థానంలో ధూళిపాళ్ల నరేంద్రకు స్పీకర్‌గా ప్రమోషన్ లభించవచ్చునని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications