మాట తప్పనని చంద్రబాబు, సరైన తిండి తినాలని కేసీఆర్!
హైదరాబాద్/చిత్తూరు: తనది ఇచ్చిన మాట తప్పేతత్వం కాదని, రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తన ఉద్దేశ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. రైతులకు న్యాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రాలేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో రైతులకు మొదటిసారి న్యాయం జరిగిందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులకు రుణమాఫీ పత్రాలు అందించారు.
రైతులంతా ఆత్మగౌరవంతో బతకాలన్నారు. భూమిలేని వారిని, బ్రాందీ షాపుల్లో పని చేసే వారిని కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రైతులుగా నియమించిందన్నారు. రుణమాఫీ అసాధ్యమంటే తాను దానిని చేసి చూపించానని చెప్పారు. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ దానిని సాధ్యం చేశానన్నారు.
కాంగ్రెస్ హయాంలో అనర్హులకు పింఛన్లు వచ్చాయన్నారు. రైతులకు ఆదాయం తగ్గిందని, అప్పులు పెరిగాయన్నారు. రైతులకు తాము చేసిన రుణమాఫీ కేవలం ప్రారంభం మాత్రమే అన్నారు. మరింత వారికి చేస్తామన్నారు. వారి కళ్లలో ఆనందం చూడాలని అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాలకు ఇంకా అధికారుల కేటాయింపు జరగలేదన్నారు.
పేదలు, వికలాంగులకు భరోసా ఇచ్చేందుకు పింఛన్లు పెంచామని వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో 30 ఏకరాల ఆసామికి కూడా పించను ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా వక్తలు పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేశారని, ఆయనకు కృతజ్ఞతలు అన్నారు.

ఆదివాసి, బంజారా భవనంలకు శంకుస్థాఫన
బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. దళిత, బంజారా భవన్, ఆదివాసీ భవన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. అదిలాబాద్ జిల్లాలోని గోండుగూడెం నుండి జల్, జమీన్, జంగిల్ నినాదం ప్రారంభమై దశాబ్దాలుగా పోరాటం సాగిందన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వం ధ్యేయం అన్నారు. బంజారా భవన్ నిర్మాణానికి ఎకరం భూమి సహా రూ.2.5 కోట్లు కేటాయించామన్నారు. అవసరమైతే మరికొన్ని నిధులు కేటాయిస్తామన్నారు. తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఇచ్చే ఆర్థిక సంవత్సరం తర్వాత గిరిజనులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామన్నారు. గిరిజనులు తండాలో రాజ్యం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఉద్యమ సమయంలోనే తాను బంజారాహిల్స్‌లో బంజారా, ఆదివాసి భవన్ కట్టిస్తానని చెప్పారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కట్టిస్తున్నానని చెప్పారు.
గిరిజనులకు భూమి పంపిణీ చేయడమే కాకుండా, ఏడాది ఖర్చు భరిస్తామన్నారు. గిరిజన మేథావులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు. గిరిజనులు ఆంటువ్యాధులతో చనిపోతున్నారని, ఈ విషయమై హైదరాబాదు వైద్యులతో మాట్లాడానని చెప్పారు. 500 మంది వైద్యులతో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు.
అదిలాబాదులో అంటురోగాలు మాయం కావాలన్నారగు. సరైన తిండి, సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రైబల్ నిధులను మళ్లించమని చెప్పారు. ఏ గిరిజన బిడ్డ పెళ్లి అయినా రూ.51వేలు ఇస్తామన్నారు. బాల్య వివాహాలు బందు కావాలన్నారు. తాను ఎక్కడకు వెళ్లినా గిరిజన బిడ్డలు ఆశీర్వదించారని, రోడ్డు లేని తండాలు లేకుండా చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications