పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతా: బాబు, జనసేన చీఫ్ పైన సాఫ్ట్ వెనుక!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూసేకరణ కొనసాగుతోందని, ఈ విషయమై అవసరమైతే తాను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ పట్ల తెలుగుదేశం పార్టీ ఇటీవల సానుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంలో టిడిపి ఎంపీలను గతంలో నిలదీసినప్పుడు టిడిపి నేతలు పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడ్డారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు సూచనతో వెనక్కి తగ్గారు.
పవన్ కళ్యాణ్ మద్దతు మనకు అవసరమని, మనం అధికారంలోకి రావడానికి ఆయన కూడా కారణమని, ఆయన విమర్శలను పాజిటివ్‌గా తీసుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు ఎప్పటికి అప్పుడు సూచిస్తున్న విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ పట్ల టిడిపి సానుకూలంగా ఉండేందుకు పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజధాని భూసేకరణ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మాట్లాడితే టిడిపి నేతలు భగ్గుమన్నారు. అదే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం భిన్నంగా స్పందించారు.
పవన్ కళ్యాణ్ రైతుల పైన ప్రేమతో తమ ప్రభుత్వాన్ని అడిగారని, తాము ఆయన సూచనలు పాటిస్తామని చెబుతున్నారు. అదే సమయంలో జగన్ రాజకీయం కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శిస్తున్నారు.
అయితే, ఒకవిధంగా టిడిపి నేతల వ్యాఖ్యల్లోను వాస్తవం ఉండవచ్చునని అంటున్నారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయ కారణాలు లేవని, తాను సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ప్రశ్నించేందుకు వచ్చారని చెబుతున్నారు. అదే జగన్ రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారని అంటున్నారు.
ఇక, పవన్ కళ్యాణ్ పట్ల ఒకింత సాఫ్టుగా ఉండటానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు వాడుకొని వదిలేశారనే అపవాదు వస్తుందని భావిస్తున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా, పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకుంటే కీలకమైన కాపు సామాజిక వర్గం దూరం అవుతుందనే ఆందోళన టిడిపిలో ఉండవచ్చునని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications