ప్రోటోకాల్ పక్కన పెట్టిన గవర్నర్: చంద్రబాబు బెట్టు, ఎందుకు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెట్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్ ప్రోటోకాల్ పక్కన పెట్టి విజయవాడకు వెళ్లి ఆయనతో మాట్లాడినా ఫలితం కనిపించలేదని చెబుతున్నారు. తనకు దానికన్నా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయని చంద్రబాబు కచ్చితంగా చెప్పినట్లు తెలుస్తోంది.

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ ఆదేశాలతో కేంద్ర దూతగా గవర్నర్ నరసింహన్ ప్రోట్ కాల్ పక్కన పెట్టి విజయవాడకు వెళ్లారు. ప్రైవేటు హోటల్‌లో బస చేశారు. అలా ఆయన ఎపి ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు విఫలమైనట్లు సమాచారం. హైకోర్టు విభజనపై చంద్రబాబు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారని, అందుకే విభజనకు అంగీకరించడం లేదని అంటున్నారు.

అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో భేటీకి రావాలన్న గవర్నర్ సూచనకు మాత్రం చంద్రబాబు సానుకూలంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. హైకోర్టు విభజన కోసం తెలంగాణ న్యాయాధికారులు, న్యాయవాదులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన నేపథ్యంలో సమస్యను పరిష్కరించడానికి రాజ్‌నాథ్ సింగ్ ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఇద్దరు ముఖ్యమంత్రులతో చర్చించి సమస్య పరిష్కారానికి సూచనలు చేయాలని ఆయన గవర్నర్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

దాంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పిలిపించి గవర్నర్ మాట్లాడారు, హైకోర్టు విభజనపై సంయమనం పాటించాలని గవర్నర్ ఆయనకు సూచించారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత కూడా హైకోర్టు విభజన జరగకపోవడంతో న్యాయవాదులు, ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని కెసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అడ్డుకోవడం వల్లే ఇది ఆలస్యమవుతోందని కూడా ఆయన అన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఏపి హైకోర్టుకు స్థలం, లేదా భవనం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన గవర్నర్‌కు చెప్పారు.

Chandrababu refuses accept for the division of High Court

ఏపి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు గవర్నర్ ప్రయత్నించారు. తనకు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలున్నాయని, అందువల్ల హైదరాబాద్ ప్రస్తుతం రాలేనని చంద్రబాబు గవర్నర్‌తో చెప్పారు. ఇదే విషయాన్ని గవర్నర్ హోంమంత్రికి చెప్పడంతో అక్కడికి వెళ్లి చంద్రబాబుతో మాట్లాడాలని చెప్పినట్లు తెలుస్తోంది.

ఏ ముఖ్యమంత్రి అయినా గవర్నరును కలవాల్సిందే తప్ప, గవర్నర్ నేరుగా ముఖ్యమంత్రులను కలిసే సంప్రదాయం లేదు. ప్రత్యేక పరిస్థితి కారణంగా నరసింహన్ ప్రోటోకాల్ పక్కన పెట్టి చంద్రబాబు వద్దకు వెళ్లారు. గేట్‌వే హోటల్‌లోనూ, తర్వాత తన నివాసంలో గవర్నర్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు.

హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వం తనకు అభ్యర్థనలు పంపిందని, కేంద్రం కూడా ఈ విషయంపై ఆందోళనతో ఉన్నందున, రెండు రాష్ట్రాలు సర్దుబాటు ధోరణి ప్రదర్శించాలని గవర్నర్ చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, దానిపై స్పందించిన చంద్రబాబు హైకోర్టు కంటే తమకు ప్రాధాన్యాంశాలు చాలా ఉన్నాయని స్పష్టం చేశారని అంటున్నారు. అయితే అమరావతిలో హైకోర్టు నిర్మించేంతవరకూ హైదరాబాద్‌లో స్థలం గానీ, భవనం గానీ ఇస్తామన్న కేసీఆర్ ప్రతిపాదనను చంద్రబాబు ముందు ఉంచారు.

ఒక రాజధానిలో రెండు హైకోర్టులు ఉండటం సరైనది కాదని, అదీకాక ఏపిలో హైకోర్టు నిర్మాణానికి సరైన వౌలిక సదుపాయాలు లేవన్న విషయాన్ని తాము స్వయంగా పరిశీలించి వచ్చామని, కాబట్టి, అక్కడ వౌలిక సదుపాయాలు కల్పించే వరకూ హైకోర్టు ఉమ్మడిగానే కొనసాగించాలనే అప్పటి చీఫ్ జస్టిస్ కక్రూ ఒక పిల్ సందర్భంలో తీర్పు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించి హైకోర్టు విభజనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ముందు ప్రభుత్వ భవనాలు నిర్మించి, వాటికి వౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.ఆ తర్వాతనే హైకోర్టు నిర్మిస్తామన్నారు. హైకోర్టు విభజనకు తాము వ్యతిరేకం కాదని, అయితే అంతకంటే కీలకమైన అంశాలు పరిష్కారం కావలసి ఉన్నాయని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా 9,10షెడ్యూల్‌లోని అన్ని అంశాలు పరిష్కారం కావలసి ఉన్నాయని, 1250 మంది విద్యుత్ ఉద్యోగులు, కృష్ణానదీ జలాలు, ఉన్నత విద్యామండలి సమస్యను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి రాష్ట్ర ప్రజల్లో ఉందని చంద్రబాబు గవర్నర్‌కు చంద్రబాబు వివరించినట్లు చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu not ready to accept for the bifurcation of common High Court at present.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి