Chandrababu : గన్నవరంలో జరిగిందిదీ..చంద్రబాబు బహిరంగ లేఖ
రెండు రోజులుగా గన్నవరం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఇవాళ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ ఆరాచక, విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే... ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు, కేసులు, హింసాత్మక ఘటనలు, పోలీసు టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇందుకు గన్నవరం విధ్వంసం ఒక తాజా ఉదాహరణ అన్నారు. గన్నవరం ఘటనలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై, పార్టీనేతల ఇళ్లపై, కార్యకర్తలపై దాడులు చేసి వారిఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు వారినే పోలీస్ టార్చర్ కు గురిచేసి....ఆ బాధితులనే నిందితులుగా మార్చి, జైలుకు పంపిన వైనంపై వాస్తవాలు మీ దృష్టికి తేవడానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
అరాచక పాలనతో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, జీవితాంతం కష్టపడి పేదలు సంపాదించుకున్నఆస్తులను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల నిర్బంధాలు, అక్రమ కేసులు, బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు వేధింపులు, మహిళలపై ఆకృత్యాలకు రాష్ట్రం వేదికగా మారిందన్నారు. పన్నుల పై ప్రజలు ప్రశ్నిస్తే కేసులు, జాబ్ క్యాలెండర్ గురించి గళమెత్తితే నిరుద్యోగ యువతకు వేధింపులు, ధాన్యం బకాయిలు అడిగితే రైతులకు బేడీలు, జీతాలు అడిగితే ఉద్యోగులకు బెదిరింపులు అన్నట్లు పరిస్థితి మారిందన్నారు. కోవిడ్ సమయంలో మాస్క్ లు అడిగిన డాక్టర్ సుధాకర్...మద్యం పై ప్రశ్నించిన ఓం ప్రతాప్ ల ప్రాణాలు తీశారన్నారు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన వరప్రసాద్ కు పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేశారని, ఇలాంటి ఘటనలు ఈ పాలనలో కోకొల్లలు అని చంద్రబాబు తెలిపారు.

ఈ నెల 20వ తారీఖున గన్నవరంలో కొంతమంది కళంకిత పోలీసు అధికారుల సహకారంతో వైసీపీ గూండాలు ప్రణాళికా బద్దంగా తెలుగుదేశం నేతలపై దాడులు, పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. స్థానిక శాసన సభ్యుడి అరాచకాలను, సంకల్ప సిద్ది స్కాంలో అక్రమాలను గన్నవరం టీడీపీ బీసీ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా గట్టిగా ప్రశ్నించారని, దీంతో ఆ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు దొంతు చిన్నాకు ఫోన్ చేసి మా నేతనే విమర్శిస్తావా అంటూ బెదిరించారన్నారు. 20వ తేదీ ఉదయం 11.30 గంటలకు వైసీపీ గూండాలు దొంతు చిన్నా ఇంటిపై దాడికి పాల్పడ్డారని, చిన్నా ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించారన్నారు. ఈ సమయంలో బాధితులు పోలీసు సాయం అర్ధించినా వారు స్పందించలేదన్నారు. దీంతో అదే రోజు సాయంత్రం నియోజకవర్గ నేతల సహకారంతో ఘటనపై ఫిర్యాదు చేసేందుకు చిన్నా సతీమణి రాణి పోలీస్ స్టేషన్ కు వెళ్లారన్నారు.
టీడీపీ నేతలంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో...వైసీపీ కార్యాలయం నుంచి వచ్చిన వైసీపీ రౌడీ మూకలు తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారన్నారు. కార్లు, ఇతర వాహనాలు తగలబెట్టారని, కార్యకర్తలు, నేతలపై దాడులుచేశారన్నారు. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు ఆత్మరక్షణ, ఆస్తులు రక్షణకు అక్కడికి వచ్చిన పాపానికి టీడీపీ వారిపైనే పోలీసులు జులుం ప్రదర్శించారన్నారు. ఘటనపై నిరసనలు తెలుపుతున్న టీడీపీ కార్యకర్తలపై రెండో సారి కూడా వైసీపీ గూండాలు పోలీసుల ఆధ్వర్యంలో దాడులకు పాల్పడ్డారని తెలిపారు. మళ్లీ రాత్రి 8 గంటలకు దొంతు చిన్నా ఇంటికి వెళ్లి అతని వాహనాన్ని దహనం చేశారన్నారు. ఒక్క రోజు వ్యవధిలో బిసి నాయకుని ఇంటిపై ఈ స్థాయి దాడి జరగడం బలహీన వర్గాలకు రక్షణ లేదన్న విషయం స్పష్టం చేస్తోందన్నారు.

ఇలా రోజంతా యదేఛ్చగా విధ్వంసం జరుగుతున్నా...ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని చంద్రబాబు తెలిపారు. తమ నేతలు జిల్లా ఎస్పికీ ఫోన్ చేసినా స్పందించలేదని, కనీసం అదనపు బలగాలు తెచ్చి పరిస్థితిని చక్కదిద్దలేదన్నారు. ఈ దాడుల ఘటనలు అన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో, అక్కడ ఉన్న వారి ఫోన్ లలో రికార్డు అయ్యాయన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే యావత్ సమాజం విస్తుపోయేలా బాధితులైన టీడీపీ కార్యకర్తల పైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆరోపించారు. కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో వైసీపీ శ్రేణులు, వారికి నాయకత్వం వహిస్తున్న గూండాలు స్వైరవిహారం చేసినా పోలీసులు వారిని కనీసం నిలువరించలేదన్నారు.
పోలీసులు దాడిలో బాధితులైన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. ఈ క్రమంలో కొత్త తరహా విష సంస్కృతికి జగన్ శ్రీకారం చుట్టారని, శాంతి భద్రతలు పరిక్షించాల్సిన పోలీసుల చేతనే తప్పుడు కేసులు పెట్టించి, తన వికృత రాజకీయానికి పావులుగా వాడుకున్నారన్నారు. పోలీసు వ్యవస్థను, పోలీసు అధికారులను తమ రాజకీయ అవసరాలకు వాడుకుని వారినీ బలిపశువులు చేస్తున్నారన్నారు. ఈ కుట్రలో భాగస్వాములు కావొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

గన్నవరం ఘటనలో 40 మందికి పైగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వారిలో కొందరిని పోలీసు కస్టడీలో దారుణంగా హింసించారని, మహిళలు అని కూడా చూడకుండా అక్రమంగా అదుపులోకి తీసుకుని రాత్రంతా మార్చి, మార్చి పోలీస్ స్టేషన్లకు తిప్పారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న టీడీపీ నేతలను జైలుకు పంపాలి అనే ఏకైక ఉద్దేశ్యంతో....టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్ కింద కేసులు జైలు పాలు చేశారని, ఈ సందర్భంలోనే పార్టీనేతలపై పోలీస్ టార్చర్ చేశారన్నారు ఎస్సీ,ఎస్టీ చట్టం కింద వ్యక్తిగతంగా కేసు పెట్టేందుకు అర్హత లేకపోయినా, క్రిస్టియన్ అయిన గన్నవరం సిఐ కనకారావుతో అట్రాసిటీ కేసు పెట్టించి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. దీనిని బట్టి పోలీసు వ్యవస్థ ద్వారా తప్పుడు కేసులు ఏ స్థాయిలో పెడుతున్నారో అర్థం అవుతుందన్నారు.
గన్నవరం దాడులకు స్థానిక ఎమ్మెల్యే వ్యూహరచన చేయగా....ఆయన వ్యక్తిగత సహాయకుడు, సంకల్ప సిద్ది స్కాంలో ప్రధాన నిందితుడు ఓరుపల్లి రంగా దాడుల్లో ముందున్నాడని చంద్రబాబు విమర్శించారు. ప్రజల నుంచి రూ. 1100 కోట్లు అక్రమంగా వసూలు చేసి వారిని మోసం చేసిన సంకల్ప సిద్ది స్కాంలో ఇతను నిందితుడన్నారు. ఈ మొత్తం ఘటనలో దాడులకు గురయ్యింది తెలుగుదేశం కార్యకర్తలని, ధ్వంసం అయింది తెలుగుదేశం పార్టీ కార్యాలయమని, తగలబడిన కార్లు తెలుగుదేశం నేతలవి, బెదిరించి, భయభ్రాంతులను చేసింది తెలుగుదేశం నేతలనే, పోలీస్ టార్చర్ అనుభవించింది తెలుగుదేశం వారే, బాధితులూ తెలుగు దేశం వాళ్లే... కానీ పోలీసులు తప్పుడు ఆరోణలతో చివరకు జైల్లో పెట్టింది తెలుగుదేశం వాళ్లనే అని చంద్రబాబు తెలిపారు.
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications