శ్రీకాకుళం గొప్పతనం చంద్రబాబు మాటల్లో..! మత్సకారులకు నిధుల విడుదల..!
ఏపీలో వేసవి సందర్భంగా మత్సకారులకు వేట విరామం ఇచ్చారు. ఈ సమయంలో మత్సకారుల కుటుంబాల జీవనం కోసం ప్రభుత్వం ఇవాళ మత్సకారుల సేవలో పథకం కింద రూ.259 కోట్ల నిధుల్ని విడుదల చేసింది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు ఈ నిధుల్ని విడుదల చేశారు. అనంతరం మత్సకారుల ఖాతాల్లో 20 వేల చొప్పున ఇవి బ్యాంకుల నుంచి జమ అవుతున్నాయి. మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం వారి వెంటే ఉంటుందని చంద్రబాబు తెలిపారు.
ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ సముద్రాల్లో చేపల వేటపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మత్సకారులకు ప్రభుత్వం మత్సకారుల సేవలో పేరుతో 20 వేల రూపాయల సాయం ఇస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం 10 వేలు మాత్రమే ఇస్తే చంద్రబాబు ప్రభుత్వం దాన్ని 20 వేలకు పెంచింది. ఈ మేరకు నిధుల్ని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని బుడగట్లపాలెంలో చంద్రబాబు విడుదల చేశారు.

ఈ నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ శ్రీకాకుళంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుందన్నారు. ఆర్మీలో పనిచేసే వారు ఎక్కువగా ఇక్కడే ఉంటారన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో తలసరి ఆదాయం తక్కువగా ఉన్నది శ్రీకాకుళం జిల్లాలోనే అన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవలేదన్నారు. ఇక్కడి జనం సమస్యల్ని తెలుసుకునేందుకే తాను ఇవాళ శ్రీకాకుళానికి వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా మత్సకారుల జీవన ప్రమాణాల్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications