ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది.. ఏదైతే ఏంటి, తెలంగాణతో పోటీ పడేదాకా: బాబు, తెలుగోళ్లంతా ఒక్కటే
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా ఇచ్చి, ఇన్సెంటివ్‌లు ఇవ్వకుంటే లాభమేమిటని, తన మొదటి డిమాండ్ హోదానే అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కేంద్రం సాయం చేస్తోంది
ఆర్థిక లోటు కింద రూ.2,300 కోట్లు ఇచ్చారని చెప్పారు. రాజధాని నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఇచ్చారని తెలిపారు. మన రాష్ట్రానికి చేసిన సాయానికి ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెప్పానని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరును ప్రధాని మోడీకి వివరించానని చెప్పారు.
వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు సాయం చేశారన్నారు. విభజన చట్టంలోని కొన్ని హామీలను కేంద్రం నెరవేర్చిందన్నారు. 2014-15 సంవత్సరంలో ఏపీలో ఆర్థిక లోటు రూ.10,500 కోట్లు ఉందని తేల్చారన్నారు. చట్టంలో ఉన్న వాటికి ఇప్పటికే కొంత ఆర్థిక సాయం చేసిందన్నారు.

నాడు కాంగ్రెస్ పార్టీ చాలా మాటలు చెప్పిందన్నారు. హైదరాబాదులాంటి రాజధానిని కడతామని చెప్పిందని, ఇంకా ఎన్నో చెప్పిందని, కానీ ఏం చేయలేదన్నారు. మంచి రాజధాని నిర్మాణానికి సాయం చేయాలని ప్రధాని మోడీని కోరానని చెప్పారు.
వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీకి హామీ ఇచ్చారని చెప్పారు. ఏపీ అభివృద్ధికి పరిశ్రమలు రావాల్సి ఉందని చెప్పారు. పన్ను రాయితీ ఇస్తేనే పరిశ్రమలు వస్తాయని చెప్పారు. రాష్ట్ర సమస్యలను, ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులకు వివరించానని చెప్పారు.
తిరుపతి సమావేశంలో నాడు మోడీ మంచి రాజధాని నిర్మాణానికి సాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజధానికి ఇచ్చిన పన్నుల వెసులుబాటును సీఆర్డీఏకు ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక తరహా తాము తమ కాళ్ల పైన తాము నిలబడే వరకు కేంద్రం సాయం చేయాలన్నారు.
హోదా, పారిశ్రామిక వెసులుబాటు వేరు

ప్రత్యేక హోదా, పారిశ్రామిక వెసులుబాటు అనేవి రెండు వేర్వేరు అంశాలు అన్నారు. ప్రత్యేక హోదా పైన నేను కోరానని, వారు పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రత్యేక హోదాను ఎలా అమలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోందన్నారు.
మేం కోరుకున్న విభజన కాదు
కేంద్రం 90 శాతం, రాష్ట్రం పది శాతం భరించేలా పారిశ్రామిక రాయితీ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని కేంద్ర సంస్థలువ వచ్చాయని, మరిన్ని రావాల్సి ఉందని చెప్పారు. ఇది తాము కోరుకున్న విభజన కాదని, కాబట్టి తాము మిగతా రాష్టాల స్థాయికి వచ్చే వరకు కేంద్రం తమకు సాయం చేయాలన్నారు.
ఏ పేరుతో ఇస్తారనేది నాకు అనవసరం
కేంద్రం ఏ పేరుతో ఏపీకి సాయం చేస్తుందనేది తనకు అనవసరమని చంద్రబాబు అన్నారు. కానీ, ఇతర రాష్ట్రాలతో సమానంగా తాము అభివృద్ధి చెందే వరకు సాయం చేయాలన్నారు. రాష్ట్రాల విభజన సమయంలో తాను ఒకటే మాట చెప్పానని, ఇరువురిని కూర్చుండబెట్టి సమన్యాయం చేయాలని కోరానన్నారు.

ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నానని, విభజన ద్వారా ఏపీకి అన్యాయం జరిగిందని, తమకు ఇప్పుడు న్యాయం చేయమని కోరుతున్నామన్నారు. విభజన హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు కోసం అవసరమైన ఏడు మండలాలను యూపీఏ తెలంగాణలోనే ఉంచిందని, కానీ ఎన్డీయే ఏపీలో కలిపిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవం వంటిదన్నారు. రైల్వే జోన్, విశాఖ, విజయవాడ, తిరుపతి ఇంటర్నేషనల్ విమానాశ్రయాలు... తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడర్, విశాఖ - విజయవాడ మెట్రో రైలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కర్నాటక, తమిళనాడు, తెలంగాణలతో పోటీ పడేస్థాయి వచ్చే వరకు తమకు సాయం అందించాలన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్ర పథకాలు ఇవ్వకుంటే ఏం లాభమన్నారు.
పేరు ఏది అయినా ఏపీకి న్యాయం కావాలన్నారు. నాడు జరిగిన విభజనలో హేతుబద్ధత లేదన్నారు. ఆస్తులు, అప్పులు, ఉద్యోగాల పంపిణీ ఇష్టానుసారంగా విభజించారన్నారు. విభేదాలు, విద్వేషాలు రెచ్చగొట్టేలా కాంగ్రెస్ వ్యవహరించిందన్నారు. మేం కష్టపడి అభివృద్ధి చేసుకుంటామన్నారు.
తెలుగు వాళ్లంతా ఒక్కటే
ఏపీ, తెలంగాణల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తెలుగు వాళ్లంతా ఒక్కటేనని చెప్పారు. ఇత రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి అయ్యే దాకా సాయం చేయాలనేది తన వాదన అన్నారు.
ప్రత్యేక హోదాతో ఏమౌతుంది?
కొందరు ప్రత్యేక హోదా అంటూ డిమాండ్ చేస్తున్నారని, అది ఒక్కటే ఏం లాభం అని అభిప్రాయపడ్డారు. పేరు ఏదైనా ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు తమకు సాయం చేయాలన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా దాని కంటే ఎక్కువ సాయం చేస్తామని కేంద్రం చెబుతోందన్నారు. తన తొలి ప్రాధాన్యత హోదానే అని, కానీ అంతకంటే ఎక్కువ కోరుతున్నామన్నారు.
ప్రత్యేక హోదా ఇచ్చి ఇన్సెంటివ్‌లు ఇవ్వకుంటే లాభమేంటన్నారు. చట్టాన్ని అమలు చేయాలని, చట్టం బయట చెప్పిన హామీలు కూడా అమలు చేయాలన్నారు. చట్టం బయట నేను చెప్పిన హామీలు, ప్రత్యేక హోదా, ఇతర రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకు అన్నారు. న్యాయపరంగా చట్ట పరంగా మనకు రావాల్సింది రావాలన్నారు. చట్టంలోని ప్రతి దానిని నెరవేరుస్తామని మోడీ చెప్పారన్నారు.
నా మొదటి డిమాండ్ ప్రత్యేక హోదానే
తన మొదటి డిమాండ్ ప్రత్యేక హోదానే అని చంద్రబాబు చెప్పారు. అయితే, ఆ తర్వాత మిగతా హామీల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. కానీ, కేంద్రం ప్రత్యేక హోదా కంటే ఎక్కువ సాయం చేస్తామని చెబుతోందన్నారు.












Click it and Unblock the Notifications