పిచ్చితనం: ఎక్కువమంది పిల్లల్ని కనాలన్న బాబుపై జేపీ ఆగ్రహం
హైదరాబాద్: ఎక్కువ మంది పిల్లలను కనాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసన సభ్యుడు జయప్రకాశ్ నారాయణ, జనచైతన్య వేదికలు సోమవారం నాడు మండిపడ్డాయి. జనాభా పెంచాలని చెప్పడం పిచ్చితనమన్నారు.
ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు పిలుపునివ్వడం సరికాదన్నారు. ఈ పిలుపు వెనుక ఉద్దేశ్యమేమిటో గానీ, అది దేశానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. జనాభా పెంచుకోవాలంటూ పిలుపునివ్వడం పిచ్చితనమని, ఆత్మహత్యాసదృశ్యమని అన్నారు.

ఇప్పుడు ఉన్న యువతకే ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారని, ఇంకా ఇప్పుడు పిల్లలని కనాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని, అలా ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఎక్కువ జనన రేటులో ఎన్నో రాష్ట్రాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయన్నారు. ప్రపంచ జనాభాలో మన దేశం వాటా 18 శాతమని, ఇందులో చాలామందికి నైపుణ్యం లేదని జేపీ తెలిపారు.
చంద్రబాబు అధిక సంతాన వ్యాఖ్యల పైన జనచైతన్య వేదిక కూడా మండిపడింది. చంద్రబాబు అలా చెప్పడం దుర్మార్గమన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి మౌలికసదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలన్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు.












Click it and Unblock the Notifications