బాబుకు రాజధాని సెగ: దిష్టిబొమ్మ దగ్ధం (ఫొటోలు)
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాజధాని విషయంలో రాయలసీమ సెగనే కాకుండా ఉత్తరాంధ్ర సెగ కూడా తగిలింది. రాష్ట్ర రాజధాని విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం విశాఖకు తీరని అన్యాయం చేసిందంటూ పలు ప్రజా సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వివద్యాలయం అవుట్‌గేట్ వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. రాజధానిగా విశాఖకు పలు అనుకూలతలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి విజయవాడను ఎంపిక చేయడం రాజకీయ దురుద్దేశమేనని ఆరోపించారు. అన్ని విధాలా వెనుకబడిన ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇవ్వకుండా మరింత వెనక్కునెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.
ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల ఆలోచనల మేరకే విజయవాడను రాజధానిగా ప్రకటించారని ఆరోపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిగా విజయవాడను ప్రకటించడం పట్ల ఉత్తరాంధ్ర పోరుబాట కన్వీనర్ హేమంత్ కుమార్ మండిపడ్డారు.
ప్రజాభిప్రాయాన్ని కాదని, వ్యక్తిగత ఎజెండాతోనే విజయవాడకు రాజధాని హోదా కల్పించారని ఆరోపించారు. హైదరాబాద్ తర్వాత అంతటి నగరంగా అభివృద్ధి చెందిన విశాఖలో రాజధాని ఏర్పాటు చేయకుండా విజయవాడకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విశాఖ ప్రాధాన్యతను తగ్గిస్తున్న ప్రభుత్వ తీరుపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.

బాబుకు రాజధాని సెగ
విజయవాడను రాజధానిగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం గేట్ వద్ద ప్రజా సంఘాల కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

బాబుకు రాజధాని సెగ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడను రాజధానిగా ప్రకటించడంపై ఉత్తరాంధ్రలో ఆందోళన దిగారు.

బాబుకు రాజధాని సెగ
విజయవాడను రాజధానిగా ప్రకటించడంపై ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు మండిపడ్డాయి. విశాఖకు అన్యాయం జరిగిందని ఆరోపించాయి.

బాబుకు రాజధాని సెగ
విజయవాడను రాజధానిగా ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను విశాఖపట్నంలో దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications