రికార్డులు తిరగరాస్తున్న పీ4- 13 లక్షల కుటుంబాల దత్తత-చంద్రబాబు వాటా 250..!
ఏపీలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. పేదల్ని దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్న మార్గదర్శుల్ని గుర్తించడంతో పాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం రూపొందించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకూ పీ4లో 13.4 లక్షల కుటుంబాల్ని 1.4 లక్షల మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. ఇందులో సీఎం చంద్రబాబు ఒక్కరే 250 కుటుంబాల్ని దత్తత తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రతి నిర్ణయమూ పేదలను దృష్టిలో పెట్టుకునే ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమం అమలును సీఎం చంద్రబాబు ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

ఈ ఏడాది ఉగాది రోజు ప్రారంభమైన పీ4 కార్యక్రమంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,40,697 బంగారు కుటుంబాలను 1,41,977 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. దీనిపై స్పందించిన సీఎం.. పేదరిక నిర్మూలన ఎన్టీఆర్ సిద్దాంతం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని భావించే సిద్దాంతాన్ని బలంగా నమ్మి పరిపాలన చేస్తున్నామని తెలిపారు. అందుకే ప్రతినిత్యం పేదల కోసమే ఆలోచన చేస్తున్నాం. పేదల అభ్యున్నతికే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. . ఆర్థిక సంస్కరణలతో సంపద వచ్చింది. ఇప్పుడు సమాజంలో అసమానతలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1.69 కోట్ల కుటుంబాలు ఉన్నాయని, సాయం కోరే పేద కుటుంబాలు 21 లక్షలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. మార్గదర్శుల ఎంపికలో ఎలాంటి బలవంతం లేకుండా, పూర్తి స్వచ్ఛంధంగానే ఈ కార్యక్రమాన్ని చేపడతున్నట్లు వెల్లడించారు. ఇటీవలే ఓ అజ్ఞాత భక్తుడు తాను స్థాపించిన కంపెనీ ద్వారా వచ్చిన సంపాదన నుంచి రూ.140 కోట్ల విలువైన 121 కేజీల బంగారాన్ని తిరుమల వెంకన్నకు ఇచ్చారని ఇంత భారీ ఎత్తున విరాళం ఇచ్చినా తన పేరు బయటకు తీసుకురావద్దని కోరారని, ఇలా కొంత మంది తమకు తోచిన రీతిలో సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారన్నారు.

తాను కూడా మార్గదర్శినేనని, కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా ఎంత బిజీగా ఉన్నా... దత్తత తీసుకున్న కుటుంబాలకు సమయం కేటాయిస్తానని తెలిపారు. మార్గదర్శులు ఇచ్చే చేయూతను బంగారు కుటుంబాలు అందిపుచ్చుకోవాలన్నారు. అలాగే సమాజం ఇచ్చిన సహకారంతో ఎదిగిన వారు సమాజానికి తిరిగివ్వాలని మార్గదర్శులు కూడా ఆలోచించాలన్నారు. మార్గదర్శులు డబ్బులిచ్చి సాయం చేయడంతో సరిపెట్టకుండా... బంగారు కుటుంబాలకు భరోసాగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications