జగన్‌ది దోపిడీదారుల పార్టీ: లోకేష్, థరూర్‌పై బాబు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతిపరులు, దోపిడీదారుల పార్టీ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అన్నారు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టిడిపి ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
అనంతరం ఆయన టిడిపి పార్టీ శ్రేణులను, అక్కడికి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు.చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టుబడ్డారని, ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ భూకబ్జాదారుడని నారా లోకేష్ విమర్శించారు.

శశిథరూర్‌పై గృహహింస కేసు పెట్టాలి: చంద్రబాబు
కేంద్రమంత్రి శశిథరూర్‌పై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై జరిగే దర్యాప్తులో రాజకీయ ప్రమేయం ఉండకూడదని డిమాండ్ చేశారు. మహిళలను విలాస వస్తువులన్న శశిథరూర్‌ను మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని ఆయన అన్నారు.
అంతకుముందు ఎన్టీఆర్ 18వ వర్థంతి సందర్భంగా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తెలుగువారి ఘనత ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. రాజకీయాలంటే ఏమిటో ఎన్టీఆర్ చేసి చూపారని అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచి రాష్ట్రానికి, దేశానికి వన్నె తీసుకొచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications