బిజెపి అంటే ఊరుకోవద్దు, జరిగిన అక్రమాలు చాలు!: బాబు, వీర్రాజు సంచలనం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పైన భారతీయ జనతా పార్టీ నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. టిడిఎల్పీ సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు బిజెపి నేత సోము వీర్రాజు వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆయన టిడిపిపై విరుచుకుపడడాన్ని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. స్థానికంగా బిజెపితో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే అన్నారు.
అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బిజెపి నేతలను కలుపుకొని వెళ్లాలని చంద్రబాబు సూచించారు. పోలవరంపై బిజెపి నేతల విమర్శలను తిప్పికొట్టాలన్నారు. పోలవరం పూర్తి చేస్తామంటే ఆ బాధ్యతను కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధమని చెప్పారు.

అవిశ్వాసంపై నేనే..
ప్రతిపక్షం రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. అవిశ్వాసం తీర్మానం, సభలో ప్రభుత్వం వ్యూహం ఎలా ఉందని చంద్రబాబు నేతలను అడిగి ఆరా తీశారు. అవిశ్వాసంపై చర్చ ఇప్పుడు వద్దని కొందరు నేతలు చెప్పినా నేనే.. ఈరోజు చేపట్టాలని సూచించానని చంద్రబాబు అన్నారు.
అవిశ్వాసం తీర్మానంపై చర్చ పక్కాగా అమలైందని పలువురు నేతలు చంద్రబాబుతో చెప్పారు. అవిశ్వాసం విషయంలో జగన్ వైఖరిని ప్రజల్లోకి తీసుకు వెళ్లామని ఎమ్మెల్ేయలు, ఎమ్మెల్సీలు చంద్రబాబుతో అన్నారు.
కాపులపై కట్టుబడి ఉన్నాం
కాపులకు రిజర్వేషన్లు, బీసీలలో చేర్చే విషయంలో కట్టుబడి ఉన్నామని చంద్రబాబు చెప్పారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను న్యాయం చేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు ప్రజలలోకి తీసుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు.
జరిగిన అక్రమాలు చాలు
ఇప్పటి వరకు జరిగిన అక్రమాలు చాలని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సొంత పార్టీ నేతలు అయినా పీడీ యాక్టు పెడతామని చెప్పారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
మోడీ పేరు పెట్టండి: సోము వీర్రాజు
ఏపీలోని పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుందని బిజెపి నేత సోము వీర్రాజు అన్నారు. ప్రతి పథకానికి చంద్రబాబు పేరు పెట్టడం సరికాదన్నారు. కొన్ని పథకాలకు ప్రధాని మోడీ పేరు కూడా పెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications