పులివెందుల కిచ్చాకే కుప్పంకు..: జగన్‌కు బాబు షాక్
హైదరాబాద్: రాయలసీమలోని గండికోట ప్రాజెక్టుకు ఈ ఏడాదిలోనే నీళ్లు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాయలసీమను కరువురహిత ప్రాంతంగా మార్చే వరకూ నిద్రపోనన్నారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ జిల్లాలోని పులివెందులకు నీళ్లు ఇచ్చిన తర్వాతే తన నియోజకవర్గమైన కుప్పంకు నీరందిస్తానని చెప్పారు.
లేక్ వ్యూ అతిథి గృహంలో తనకు కృతజ్ఞతలు తెలపటానికి శనివారం కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చిన వందలాది మంది రైతులతో చంద్రబాబు మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పులివెందులలో బంగారం పండే తోటలున్నాయని, చీని, అరటి సమృద్ధిగా నీరు అందించగలిగితే రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారని, రాయలసీమకు నీళ్లు అందించాలని ఎనిమిది నెలల నుంచి నేను వందల గంటలపాటు అధికారులతో సమీక్ష చేశానన్నారు.

అవుకు నుంచి గండికోటకు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి. ఎంత కష్టమైనా గండికోటకు ఈ ఏడాదే నీళ్లు తీసుకొస్తామని, అవసరమైతే గాలేరు - నగరి కాల్వలపై బస్సులో పడుకుని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తామని, ఈ ఐదేళ్లలోనే రాయలసీమకు నీళ్లు తెప్పించి చూపిస్తామని, రాబోయే రెండేళ్లలో పులివెందులను సస్యశ్యామలం చేస్తానన్నారు.
కుప్పంలో 100 కిలోమీటర్ల కాలువలు తీయాలని, అందుకు కొంత సమయం పడుతుందన్నారు. చిత్రావతి రిజర్వాయర్ నుంచి తక్షణం అర్ధ టీఎంసీ నీరిచ్చి పులివెందుల రైతుల కష్టాలు తీరుస్తానని, ఈ మేరకు మంత్రి దేవినేని ఉమాతో మాట్లాడానని తెలిపారు. రెండేళ్లలో గండికోట కెనాల్ సామర్థ్యం పెంచి, పూర్తిస్థాయి నీరందేలా ఏర్పాటు చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications