ఇక్కడ రాడు, అక్కడ దిక్కు లేదు: కెసిఆర్‌పై బాబు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇక్కడ రాదు, ఢిల్లీలో దిక్కు లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెరాస నాయకుడు కొత్త పల్లవి అందుకున్నారని, మూడో ఫ్రంట్‌లో ఉంటానంటున్నారని, ఎన్నికలయ్యాక ఎక్కడుంటాడో కెసిఆర్‌కే తెలియదని అన్నారు. ఒకవేళ మూడో కూటమి రాకపోతే ఎన్‌డీఏ దగ్గరకు వెళ్లేవారిలో కెసిఆర్ ముందుంటారని మండిపడ్డారు.
తెరాస ఒక మునిగిపోయే నావ అని, ఆ పార్టీది గంటకో మాట. పూటకో కూటమి అని, ఇప్పుడు కొత్తగా థర్డ్ ఫ్రంట్ గురించి చెబుతోందని, పోయినసారి ఆ కూటమితో జట్టుకట్టి చివరకు ఫలితాలు కూడా రాకముందే బయటకు గెంతు వేసిందని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బోడుప్పల్, మల్కాజిగిరి, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్‌షోలు, బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు.

పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌ని అనాథగా మార్చివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు కంపెనీలు రావడం లేదు. పెట్టుబడులు పెట్టడం లేదని, అనిశ్చిత పరిస్థితి ఉందని, ఎవరంటే వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. హైదరాబాద్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చే సత్తా, సమర్థత తెలుగుదేశం పార్టీకే ఉన్నదన్నారు. హైదరాబాద్‌లోనూ, తెలంగాణలోనూ అభివృద్ధి అంతా తమ పార్టీ హయాంలోనే జరిగిందని, ఇక్కడ ఓటడిగే హక్కు తమకే ఉన్నదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీని నిలువులోతున పాతరేస్తేనే దేశానికి, రాష్ట్రానికీ మోక్షమని అన్నారు. కాంగ్రెస్ మరో పనికిమాలిన పార్టీ అని, భాగ్యాన్ని అందిస్తామని కబుర్లు చెప్పి పదేళ్లు దౌర్భాగ్య పాలన ఇచ్చిందని అన్నారు. తెలుగుదేశం, బిజెపి పొత్తు తెలంగాణలో సునామీ సృష్టించబోతోందని, సైకిల్ ప్రతిచోటా బుల్లెట్‌లా దూసుకుపోతోందని ఆయన చెప్పారు. కేంద్రంలో మోడీ, ఇక్కడ తాను వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications