వారితో లోకేష్-బ్రాహ్మణిలు పోటీ పడలేరు, వారికి కూడా చెప్పేశా: బాబు ఆసక్తికరం
విజయవాడ: తన కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివారని, తాను ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థిని అని, కానీ వారు ఎస్వీయుతో పోటీ పడలేరని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీరు ఎస్వీయూ విద్యార్థులతో పోటీ పడలేరని తాను తన కొడుకు, కోడలుకు చెబుతుంటానని అన్నారు. వీసీ బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. తన వంతుగా వర్సిటీలో మౌలిక వసతులు కేటాయించానని అన్నారు.
ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం పరిమితమేనని, ఎక్కువ నిధులు ఇస్తే చెడిపోతారని, బద్దకం పెరిగిపోతుందని, అందుకే పరిమితంగా వనరులు ఇచ్చి పెద్ద చాలెంజ్ వీసీ ముందు ఉంచానని చెప్పారు. పరిశోధనల పరంగా మరింత అభివృద్ధి చెందాలంటే వర్సిటీలు స్వయం వనరులు సమీకరించుకోవాలన్నారు. అందుకు ఏం చేయాలో ఆలోచించుకోవాలన్నారు.

1972లో ఎకనామిక్స్ విద్యార్థిగా, విద్యార్థి సంఘం నాయకుడిగా, తొలిసారి ఎమ్మెల్యే అయిందీ ఇక్కడి నుంచేనని ఎస్వీ యూనివర్సిటీతో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఇక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరంలోనే తన స్వగ్రామముందన్నారు.
శ్రీనివాస ఆడిటోరియంలో మంగళవారం ప్రారంభమైన భారత ఆర్థిక సంఘం 99వ వార్షిక సదస్సుకు హాజరైన ఆయన ఆర్థికవేత్తలు, పరిశోధకులకు మార్గ నిర్దేశం చేశారు. తానూ అర్థశాస్త్ర విద్యార్థినే అన్నారు. డీఎల్ నారాయణ వంటి వారు తనకు విద్యాబోధ చేశారన్నారు.












Click it and Unblock the Notifications