నిద్రలోనూ తెరాసకు మా భయమే: చంద్రబాబు
హైదరాబాద్: నిద్రపోతున్నా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలకు తమ పార్టీయే గుర్తొస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు సింగరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యుడు కొట్టు సత్యనారాయణ మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
రోజురోజుకూ తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. తెలంగాణలోనూ తిరుగులేని మెజారిటీతో విజయం సాధిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో పెదల కోసం రాజీలేని పోరాటం చేసింది తమ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. తమ పార్టీ ప్రభంజనం చూసి రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆయన అన్నారు.

హైదరాబాద్‌ను తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గానీ, కాంగ్రెసు దొంగలు గానీ అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ తమదేనని చెప్పుకున్నారు. బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది తమ పార్టీ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ నుంచి, తెలుగు జాతి నుంచి తనను ఎవరూ వేరు చేయలేరని ఆయన అన్నారు.
కెసిఆర్‌కు నీతీనిజాయితీ, విశ్వసనీయత లేదని అన్నారు. అధికారంతో నిమిత్తం లేకుండా ప్రజలకు సేవ చేసే పార్టీ తమది మాత్రమేనని ఆయన అన్నారు. బలహీన వర్గాలకు అధికారం కట్టబెట్టే బాధ్యత తనదేనని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications