కేశినేని చిన్ని-కొలికపూడి వివాదంపై రిపోర్ట్ రెడీ..! తప్పెవరిదంటే ?
ఏపీలో ఈ మధ్య కాలంలో అధికార టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య వివాదం రాజకీయంగా పెను దుమారం రేపింది. ఇద్దరూ పరస్పర విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం, ఆ తర్వాత అధిష్టానానికి ఫిర్యాదులు చేసేందుకు ప్రయత్నించడంతో అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇద్దరినీ పిలిపించి మాట్లాడదామని అనుకున్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను సైతం వారించారు.
అయితే ఆ తర్వాత టీడీపీ క్రమశిక్షణా కమిటీ జోక్యం చేసుకుంది. వివాదానికి కారణమైన టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాస్ ఇద్దరినీ వేర్వేరుగా పిలిపించి వివాదంపై వివరాలు తీసుకుంది. వారిద్దరి అభిప్రాయాలు తెలుసుకున్నాక అధిష్టానానికి ఇచ్చేందుకు రిపోర్ట్ తయారు చేసింది. ఈ రిపోర్ట్ తాజాగా సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. దీంతో ఈ రిపోర్ట్ ఆధారంగా ఏ చర్యలు తీసుకోబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

చంద్రబాబుకు టీడీపీ క్రమశిక్షణా కమిటీ నివేదిక అందగా.. ఇందులో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ కేడర్‌ను ఓన్ చేసుకోవడంలో కొలికపూడి విఫలమయ్యారని, అందుకే వివాదం తలెత్తినట్లు గుర్తించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే కొలికపూడిదే తప్పుగా ఇందులో నిర్ధారించినట్లు తేల్చారు.

తిరువూరు టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు అడిగారంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలు తప్పని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో ఈ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయా.? వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా.?అన్నది తేలాల్సి ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కేశినేని చిన్ని తనపై కొలికపూడి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతూ కౌంటర్ ఇచ్చారు. అలాగే పార్టీ తనపై చర్యలు తీసుకుంటుందని భావించడం లేదని కూడా వెల్లడించారు.












Click it and Unblock the Notifications