సమైక్యాంధ్ర సీఎంలా వద్దు, పట్టిసీమను ఆపండి: మైసూరా రెడ్డి
కర్నూలు: నారా చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంవీ మైసూరా రెడ్డి శుక్రవారం కర్నూలు జిల్లాలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల కోసం వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.
జగన్ వెంట మైసూరా రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు జిల్లాలోని బానుకచర్ల హెడ్ రెగ్యులరేటర్ వద్ద మాట్లాడారు. రాయలసీమకు నీళ్లిస్తానని, ఆంధ్రాకు నీళ్లిస్తానని చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నాడని ధ్వజమెత్తారు.

పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం వల్ల రాయలసమ ప్రజలు కష్టాలు తీరుతాయని, వాటిని తాను తీరుస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. చంద్రబాబు రాయలసీమ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. గాలేరు - నగరి ప్రాజెక్టు ఏమవుతుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పట్టిసీమ వల్ల ప్రయోజనం లేదన్నారు. ఈ ప్రాజెక్టును గోదావరి, కృష్ణా డెల్టా రైతులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అయినా చంద్రబాబు ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని చూడటం విడ్డూరమన్నారు. చంద్రబాబు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం కట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications