జగన్ చేసే పనికి ఏపీ బ్రాండ్ దెబ్బతింటోంది: ఇళ్ల కోసం రూపాయి కట్టొద్దంటూ చంద్రబాబు
అమరావతి: ఏపీ ప్రభుత్వ విధానాలపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వచ్చిన వరదల్లో చనిపోయినవారివి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. సోమవారం పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన చేతగానితనానికి నిదర్శనమన్నారు. వరదల్లో అధికార యంత్రాంగం వైఫల్యంపై న్యాయ విచారణ జరిపించాలని అన్నారు. బాధితులకు ఇంత వరకు నష్ట పరిహారం అందలేదని, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధులు రూ. 1100 కోట్లు బాధితులకు ఇవ్వకుండా దారి మళ్లించారని ఆరోపించారు.

వరి వేయొద్దని చెబుతూ రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొందని అన్నారు. ఓటీఎస్ పథకం పేరుతో రూ. 14,261 కోట్లు పేదల నుంచి వసూలు చేయడాన్ని విరమించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.
ప్రజా సమస్యలు చర్చించే శాసనసభను కౌరవ సభగా మార్చారని విమర్శించారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించి మహిళల పట్ల వైసీపీ వైఖరితోపాటు క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజా సమస్యలుచర్చిస్తామని చంద్రబాబు తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎల్ఐసీలో పొదుపు చేసుకున్న రూ. 2,200 కోట్లను స్వాహా చేశారని వైసీపీ సర్కారుపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. చట్ట వ్యతిరేక నిధుల బదిలీ ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ విధ్వంస తీరు విపరీతమైన అప్పులతో రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింటోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇది ఇలావుండగా, చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్‌ను తమ సమస్యల పరిష్కారం కోసం అడ్డుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేయడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు.
ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఎందుకంటూ ఏపీ సర్కారుపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నించే ప్రజలను, విద్యార్థి సంఘాలను అక్రమంగా అరెస్టులు చేయించడం జగన్‌కే చెల్లిందని... రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్న జగన్ కంటే ఉత్తరకొరియా కిమ్ బెటరంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని లోకేష్ అన్నారు.
Recommended Video
ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వంలోని పెద్దలు కనీసం మనుషులుగా కూడా చూడకుండా అవమానిస్తున్న తీరు బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం తాత్సారం చేయకుండా సీపీఎస్ రద్దు చేయాలని లోకేష్ అన్నారు. రూ.1600 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో పెట్టిన ఏడు డీఏలు వెంటనే ఇవ్వాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications