జగన్ చర్యతో ఏపీకి తీవ్రనష్టం, ముందుచూపు లేకే ప్రాణాలు పోయాయి: చంద్రబాబు ఫైర్
అమరావతి: రాజధానిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతోందని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్బరాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణ, సీఆర్డీయే రద్దు బిల్లు ఉపసంహరణ, మరో బిల్లు తెస్తామన్న సీఎం జగన్ వైఖరి రాష్ట్రానికి ఎంతో నష్టం చేకూర్చుతుందన్నారు.

ఏపీ ఆదాయానికి గండి కొడుతున్నారన్న చంద్రబాబు
జగన్ సర్కారు చర్యలతో ఉపాధి అవకాశాలు పోవడంతోపాటు రాష్ట్ర ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతుందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలకు ఉపాధి అవకాశాలను దెబ్బ తీసేందుకే జగన్ అనాలోచిత చర్యలు చేపడుతున్నారన్నారు. అమరావతి రైతులు ఆందోళన చేస్తుంటే జగన్ ఎద్దేవా చేశారన్నారు. జగన్ పార్టీ, నాయకులు ఎప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ తామే కరెక్ట్ అంటూ సమర్ధించుకుంటున్నారని, రాష్ర్ట ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నారన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టిన వారిని కూడా జగన్ పార్టీ నాయకులు విమర్శించారన్నారు.

జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత వచ్చిందంటూ చంద్రబాబు
జగన్ పాలనపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. ఇళ్ల స్థలాలు, వాటిల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్దీకరణ పేరుతో ఒక్కో పేద కుటుంబం నుంచి రూ. 10వేల నుంచి 20 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా ఆదాయం పొందాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. పేద కుటుంబాలు ఎవరూ ఈ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెల రోజుల్లోగా ఉచితంగా పేదలకు పంపిణీ చేస్తామన్నారు చంద్రబాబు.

జగన్ సర్కారు ముందుచూపు లేకే ప్రజల ప్రాణాలు పోయాయన్న బాబు
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వరదల వల్ల ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు 34 మంది చనిపోగా, 10 మంది గల్లంతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సహాయ కార్యక్రమాలను అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ అజాగ్రత్త, ముందస్తు జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్లే ఇంత మంది ప్రాణాలు కోల్పోయారని ధ్వజమెత్తారు. టీడీపీ ఆధ్వర్యంలో బృందాలు బాధితులకు అన్ని విధాలా అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నవంబర్ 23, 24 తేదీల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Recommended Video

మరో రాజధాని బిల్లు మతలబేంటి?: చంద్రబాబు
ఎంతో ముందు చూపుతో అమరావతిని నిర్మించడానికి తలపెడితే జగన్ అంతా మూడు రాజధానుల పేరిట అమరావతిని పక్కకు పెట్టారన్నారు. నేడు రాష్ట్రంలో రాజధాని లేకుండా చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. మరో రాజధాని బిల్లుతో వస్తానడంలో ఏం మతలబు ఉందంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ర్ట ప్రజల నిర్ణయాలను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజధాని బిల్లును వెనక్కు తీసుకోవడంతోనే ఆగిపోమని అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీపోరాటం చేస్తుందని చంద్ర బాబు చెప్పారు. ఇప్పటికైనా జగన్, జగన్‌పార్టీనాయకులు అహంకారం వీడాలన్నారు. ఇన్నేళ్లు రాజధాని నిర్మించకుండా అటు ప్రజలను ఇటు రైతులను జగన్ మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు.












Click it and Unblock the Notifications