లండన్ లో స్టాలిన్ పై విజయ్ నిఘా? ఇంటెల్ రిపోర్ట్..!
తమిళనాడులో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ (Vijay)కు ఇప్పుడు రాజకీయంగా పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తెరవెనుక ప్రత్యర్ధులు పలు కుట్రలు చేస్తున్నారని తాజాగా బయటపడిన ఓ ఘటన నిరూపించింది. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్ధుల విషయంలో విజయ్ చాలా అప్రమత్తంగా ఉంటున్నారు.
ఇదే క్రమంలో తాజాగా లండన్ టూర్ కు వెళ్లిన విపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin)పై విజయ్ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. స్టాలిన్ తన మనుమడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కుమారుడైన ఇదయనిధి లండన్‌లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుంచి స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ విభాగంలో పట్టా పొందారు. ఈ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 4వ తేదీన తన కుటుంబంతో కలిసి లండన్ వెళ్లారు. అయితే లండన్‌లో ఆయన కదలికలపై నిఘా ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సీఎం విజయ్ ఆదేశాల మేరకు తమిళనాడు రాష్ట్ర నిఘా విభాగం లండన్‌లో స్టాలిన్ పర్యటనను నిశితంగా గమనిస్తోంది. అక్కడ ఆయన ఎవరిని కలుస్తున్నారు, ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ, లండన్‌లో తగిన సమాచార వనరులు లేకపోవడంతో రాష్ట్ర నిఘా బృందం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. సమాచారం కోసం వారు కేంద్ర నిఘా విభాగం సహాయాన్ని కోరినప్పటికీ, కేంద్ర వర్గాలు ఆ వివరాలను పంచుకోవడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు లండన్‌లో ఉన్నప్పటికీ స్టాలిన్ తమిళనాడు అంతర్గత రాజకీయాలపై పట్టు సాధిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ఆయన నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తాజాగా సీఎం విజయ్ కరూర్‌లో పర్యటించిన సమయంలో డీఎంకేను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. విజయ్ ఈ ప్రసంగం చేయకముందే స్టాలిన్ అలర్ట్ అయ్యారు. కరూర్‌లో విజయ్ మాట్లాడే ప్రతి మాటకు తక్షణమే బలమైన కౌంటర్ ఇవ్వాలని లండన్ నుంచే ఆదేశాలు జారీ చేశారు. స్టాలిన్ సూచనల ప్రకారం ఉదయనిధి స్టాలిన్ ఈ విషయాన్ని పార్టీ నేత శివశంకర్‌కు తెలిపారు. విజయ్ చేసిన ఆరోపణలను లోతుగా విశ్లేషించిన శివశంకర్, అరివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధికార పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. డీఎంకే ఐటీ వింగ్ సైతం విజయ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కౌంటర్లు ఇచ్చింది.














Click it and Unblock the Notifications