జగన్ పాలనలో బాగుపడింది ఆ నలుగురు రెడ్లే; కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ: చంద్రబాబు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సంక్షేమ పథకాల అమలుతో ప్రజాక్షేత్రంలోకి జగన్ వెళుతుంటే, చంద్రబాబు బహిరంగ సభలతో దూసుకుపోతున్నారు. తాజాగా కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామకుప్పం లో జరిగిన టిడిపి బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు ఈసారి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ తప్పనిసరిగా సాధిస్తాం అన్నారు.
నాకు వయసు నెంబర్ మాత్రమేనని, కానీ నా ఆలోచనలు వచ్చే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. తన ఆలోచనలు 15 ఏళ్ల యువకుడిలా ఉంటాయని పేర్కొన్న ఆయన ఏపీ అభివృద్ధికి తాము కట్టుబడి పని చేస్తామన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే వైసిపి దోచిన డబ్బంతా కక్కించే బాధ్యత తీసుకుంటామని ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులుగా మారారని, అందుకు కారణమైన సైకో పాలనకు బుద్ధి చెప్పాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని, ఏ ఒక్కరికి ఉద్యోగావకాశం కల్పించలేదని పేర్కొన్నారు చంద్రబాబు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన తాను ఏ రోజు ఏ తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
బటన్ నొక్కి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని దీంతో ప్రజలు రోడ్డున పడ్డారని, సీఎం జగన్ మాత్రం ప్యాలెస్ లో ఉన్నాడని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ఈ తరహా రాజకీయాలు మునుపెన్నడూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హంద్రీనీవా లో నీళ్లు పారించమంటే, అవినీతి పారిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని, వాటాలు అడుగుతున్న కారణంగా పెట్టుబడులు ఎవరు పెట్టడం లేదని చంద్రబాబు ఆరోపించారు.

తాము ఓడిపోతున్నట్టు జగన్ కి అర్థమైందని, తిరుగుబాటు మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు. వైసిపి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేసిన ఆయన, వైసీపీలో సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేస్తారు జగన్ ప్రభుత్వంలో రెడ్లు కూడా ఎవరు బాగుపడలేదు అని, కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారని వ్యాఖ్యానించారు.
పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బా రెడ్డి, విజయసాయి రెడ్డిలు మాత్రమే బాగు పడ్డారని పేర్కొన్నారు. గాడి తప్పిన పాలన మళ్లీ సరి చేయాలన్నదే తన కోరిక అని వ్యాఖ్యానించిన చంద్రబాబు మార్చాల్సింది సీఎం జగన్మోహన్ రెడ్డి నే అని స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో ఆ పని చేస్తారని ప్రజలపైన విశ్వాసం ఉందన్నారు.












Click it and Unblock the Notifications