బాబు ఆన్సర్, జగన్‌పార్టీ రగడ: నేర్చుకోవాలని బాలకృష్ణ
హైదరాబాద్: గవర్నర్ తీర్మానం పైన జరిగిన చర్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు చెరిగారు. టిడిపి హయాంలో అభివృద్ధి సాధిస్తామని చెప్పారు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారన్నారు. తాము చరిత్రను తిరగరాస్తామని, తమ రికార్డును తామే తిరగరాస్తామని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రజలు నమ్మారన్నారు. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు ఆలోచించి టిడిపికి ఓటేశారన్నారు. రాష్ట్రాన్ని కష్టాల నుండి గట్టెక్కించే శక్తి టిడిపికే ఉందని ప్రజలు గట్టిగా భావించారన్నారు. అవినీతి, అసమర్థ పాలన వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని వనరులు భారత దేశంలో ఉన్నాయన్నారు. వనరులు సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి సాధ్యమన్నారు.
పదేళ్ల కాంగ్రెసు పాలనలో ఎక్కడ చూసినా కుంభకోణాలే అన్నారు. ఈ దేశంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్నారు. కామన్వెల్త్ గేమ్స్, 2జీ, బొగ్గు.. ఇలా ఎన్నో కుంభకోణాలు జరిగాయన్నారు. కుంభకోణాలకు అసమర్థత తోడైందన్నారు. పదేళ్ల కాంగ్రెసు పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. టిడిపి పాలన వల్లనే హైదరాబాదుకు ఆదాయం పెరిగిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయన్నారు. ఆర్థిక సంస్కరణలు రాకముందు దేశంలో ఏకపక్ష పాలన ఉందన్నారు.

తాను విజన్ 2020 అంటే కొందరు 420 అన్నారని, ఇప్పుడు వారే 420 అయ్యారని ఆరోపించారు. టిడిపి పాలనలో రాజధాని అభివృద్ధి జరిగిందని శ్రీకృష్ణ కమిటీ నివేదిక చెప్పిందన్నారు. తమ వద్ద మంత్రదండం లేకున్నప్పటికీ రాబోయే ఐదేళ్లలో అభివృద్ధి చేస్తామన్నారు.
చంద్రబాబు మాట్లాడుతుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులో మధ్యలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు గందరగోళం చెలరేగింది. సభాపతి కోడెల శివప్రసాద్ వారిని కూర్చోవాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కాగా, సిఎం ఎవరిని కూడా విమర్శించలేదని యనమల రామకృష్ణుడు చెప్పారు. సిఎం తల్లి కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంటే.. పిల్ల కాంగ్రెస్ ఎందుకు స్పందిస్తోందని చురకలు అంటించారు. జగన్ మాట్లాడుతూ.. అబద్దాలు చెబితే అభ్యంతరం చెబుతామన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు చదువుకొని రావాలని.. తన ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా చంద్రబాబు అన్నారు. ముందుంది ముసళ్ల పండగ అన్నారు. ప్రపంచానికే తాను పాఠం చెప్పానని, మీ వద్ద నేర్చుకోదల్చుకోలేదన్నారు. మీ సహకారం కావాలని కోరుకుంటున్నామన్నారు. కిరణ్ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఇలా ఎన్నో ఉన్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
అనంతరం చంద్రబాబు ప్రసంగం కొనసాగిస్తూ.. త్వరలో పరిశ్రమలకు, రైతులకు 24 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పారు. తప్పు చేసిన వారి పైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని, తాను ఎవరినీ వ్యక్తిగతంగా ఉద్దేశించి వ్యాఖ్యానించలేదని చెప్పారు. తప్పు చేసిన వారి పైన కఠినంగా వ్యవహరిస్తామని మాత్రమే చెప్పామన్నారు.
నేర్చుకోవాల్సింది ఉంది: బాలకృష్ణ
అసెంబ్లీ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ వేరుగా అన్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లో విశ్వవిద్యాలయం నెలకొల్పాలని సూచించానని చెప్పారు. హిందూపురం నుండి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications