చంద్రబాబు దెబ్బకు ఆ పని చేసిన వైసీపీ నాయకులకు టెన్షన్, బయటకు తీస్తున్న బాబు
వైసీపీ పాలనలో జరిగిన భూ దందాలు, అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ భూములు, చుక్కల భూములు కబ్జా చేసిన వారిని, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి చేసి ఆ భూములను రిజిస్టర్ చేయించుకున్న వైసీపీ పెద్దలు, వారి అనుచరులు ఎవ్వరినీ వదిలపెట్టకూడదని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది.
బ్రిటిష్ కాలంలో భూ సర్వే జరిగినప్పుడు ఆ భూముల యజమానులు స్థానికంగా అందుబాటులో లేకుంటే ఆ భూములను ఆర్ఎస్ఆర్ లో నమోదు చేసే సమయంలో హక్కుదారుల పేర్లకు బదులుగా చుక్కలు అంటే డాట్స్ పెట్టారు. యజమానులు గుర్తింపు లేని భూములకు ప్రభుత్వం దరఖాస్తు పట్టాలు ఇవ్వగా కొన్ని భూముల్లో చాలా ఏళ్ల నుంచి కొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇలా చుక్కల భూములు కొందరి అధీనంలో ఉన్నాయి.

అయితే 2008 నుంచి అలాంటి చుక్కల భూములను రిజిస్టర్ చెయ్యడానికి ప్రభుత్వం నిరాకరించింది. తరువాత ఆయా ప్రాంతాల్లోని చుక్కల భూముల వివరాలను స్థానిక తహసీల్దార్లు కలెక్టర్ కార్యాలయాలకు పంపించడంతో ఆ భూములను 22 ఏలో చేర్చారు.ఇలాంటి భూములు ఆధీనంలో పెట్టుకున్న రైతులు ఆ భూములను అమ్ముకోలేక, పిల్లల చదువులు, వారి సొంత అవసరాలు తీర్చుకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు చుక్కల భూముల మీద కన్నువేశారు. రెవెన్యూ యంత్రాగాన్ని గుప్పట్లో పెట్టుకున్న వైసీపీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా చుక్కల భూమలను నిషేధిత 22ఏ నుంచి తొలగించారు. చుక్కల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటూ మొత్తం సర్వే చేసిన వైసీపీ నాయకులు ఆ జాబితాను చేతిలో పెట్టుకని వారి గాడ్ ఫాదర్ల దగ్గరకు వెళ్లారు.

చుక్కల భూములను తాము చెప్పిన వారికి రిజిస్టర్ చేయించాలని ఆప్పటి వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు రెవెన్యూ శాఖ అధికారుల మీద ఒత్తిడి తెచ్చారని తెలిసింది. వైసీపీ నాయకులు ఆదేశాలకు సలామ్ చేసిన రెవెన్యూ శాఖ అధికారులు చుక్కల భూములను నిబంధనలకు విరుద్దంగా వాటిని వైసీపీ నాయకుల పేర్లతో రిజిస్టర్ చేయించారని తెలిసింది. ఇలాంటి గోల్ మాల్ వ్యవహారాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా జరిగాయని చంద్రబాబు ప్రభుత్వం పసిగట్టింది.
చంద్రబాబు సీఎం అయిన తరువాత చుక్కల భూముల గోల్ మాల్ వ్యవహారంపై ఎక్కువ శ్రద్ద చూపించడంతో వైసీపీ నాయకులు హడలిపోయారు. ఇదే విషయంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పంటించారని ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని 22ఏ సెక్షన్ విభాగంలోనే మంటలు వ్యాపించాయని ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు నిర్దారించారు. మదనపల్లె సబ్ డివిజన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో ఇలాంటి చుక్కల భూములు గోల్ మాల్ జరిగిన మండలాల రికార్డులను చంద్రబాబు ప్రభుత్వం పరిశీలిస్తోంది.












Click it and Unblock the Notifications