ప్రతి ఇంట్లో కంప్యూటర్ లిటరేట్, బాసర ఐఐటి కల: బాబు
హైదరాబాద్: భారత దేశం నాలెడ్జ్ హబ్‌గా తయారు కావాలని, ప్రతి ఒక్క ఇంట్లో కంప్యూటర్ లిటరేట్ ఉండాలని, యువత ఉద్యోగం కోసం ఇతర దేశాలకు వెళ్లడం కాదని, ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని, ఇది తన కోరికని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది జరిగి తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సరస్వతి దేవి కొలువై ఉన్న బాసరను నాలెడ్జ్ హబ్‌గా తయారు చేయాలని భావించానని, అది తన కోరికని ఆయన అన్నారు. పాదయాత్ర సమయంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మాట్లాడానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఐఐటీ వస్తే బాసరలోనే పెట్టాలని ఆలోచించినట్లు ఆయన తెలిపారు. చివరకు ట్రిపుల్ ఐటీ బాసరకు వచ్చిందని బాబు తెలిపారు.
ఇండో-అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్ రాజిరెడ్డితో తనకు 20 ఏళ్ల పరిచయం ఉందని, రాజిరెడ్డి తెలుగువాడు కావడం, మన రాష్ట్రం నుంచి ఆయన అమెరికాకు వెళ్లడం, ప్రపంచం మొత్తం ఐటీ అంటే ఒక ఐకాన్‌గా రాజిరెడ్డి ఎదగడం గర్వపడదగ్గ విషయమని ఆయన అన్నారు. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక యూనివర్శిటీ ప్రథమ స్నాతకోత్సవం సోమవారం హైదరాబాద్ హెచ్ఐసీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు.

రాబోయేది ఐటీ అనుబంధ ఆర్థిక వ్యవస్థ అని చంద్రబాబు అన్నారు. ఐటీ రంగంలో పరిశోధనలకోసం ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశామని, దేశంలో ఎక్కువ పీహెచ్‌డీలు ట్రిపుల్ ఐటీ నుంచే వస్తున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. యువత వృత్తి నైపుణ్యతపై దృష్టిపెట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారు.
వచ్చే 15 ఏళ్లలో అమెరికా, ఇండియా, చైనా ఈ మూడు దేశాలు అగ్ర దేశాలుగా ఉంటాయని, యువతను, విద్యార్థులను మనం బాగా ఉపయోగించుకుంటే ఈ మూడు దేశాల్లో భారతదేశం అగ్రదేశంగా ఉండే అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు.












Click it and Unblock the Notifications