వడ్డాణం ఎఫెక్ట్: గిఫ్ట్‌లొద్దని చంద్రబాబు మందలింపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎవరు కూడా బహుమతులు తీసుకోవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు ఇటీవలె ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆమెకు వారు సుమారు రూ.37 లక్షల విలువైన బంగారు వడ్డాణం కానుకంగా ఇచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది చర్చనీయాంశమైంది. రాజకీయవర్గాల్లో కలకలం కూడా రేపుతోంది. దీని పైన చంద్రబాబు బుధవారం స్పందించారు.
కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఎవరి నుంచీ ఏవిధమైన బహుమతులు తీసుకోవద్దంటూ మంత్రులకు స్పష్టం చేశారని తెలుస్తోంది. ప్రత్యేకంగా ఎవరినీ పేరుపెట్టి ఆయన వ్యాఖ్యానించకపోయినా సదరు మంత్రితో పాటు మిగతా వారిని సాధారణంగా ఉద్దేశించి ఈ విషయం చెప్పారని అంటున్నారు.

ఇదిలా ఉండగా, గ్రానైట్ వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళా మంత్రికి లక్షల విలువ చేసే వడ్డాణం ఇచ్చారనే ప్రచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు సచివాలయంలోను హాట్ టాపిక్ అయినట్లుగా ఊహాగానాలు వచ్చాయి. ఈ విషయమై చంద్రబాబు సదరు మహిళా మంత్రిని వివరణ అడిగినట్లుగా వార్తలు వచ్చాయి.
ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు ఇటీవలె ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు వారు సుమారు రూ.37 లక్షల విలువైన బంగారు వడ్డాణం కానుకంగా ఇచ్చినట్లు చర్చ సాగింది.అయితే, ఈ ఆరోపణలను పీతల సుజాత ఖండించారు.
తాను ఎవరి దగ్గరా బహుమతులు తీసుకోలేదన్నారు. అసలు వడ్డాణం గురించి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇదంతా తన పైన సాగుతున్న దుష్ప్రచారమని సుజాత అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి చంద్రబాబు తనను ఎలాంటి వివరణ కోరలేదని చెప్పారు. తనకు గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేసిన మాట వాస్తవమేనని, కానీ బహుమతులు ఇవ్వలేదన్నారు.












Click it and Unblock the Notifications