బిజెపి నేతలు ఏమన్నా సర్దుకుపోండి!: బాబు క్లాస్, భూసేకరణ పైనా..
విజయవాడ: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం పైన టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు గురువారం క్లాస్ తీసుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆయన ఉదయం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. బహిరంగంగా మాట్లాడే ముందు నియంత్రణ పాటించాలని సూచించారు. ముఖ్యంగా బిజెపి నేతల విమర్శల పైన ఆచితూచి స్పందించాలని సూచించారు. బిజెపి విమర్శిస్తే... ప్రతిగా మీడియా ముందు మాట్లాడటం కన్నా సర్దుకుపోవాలని సూచించారని తెలుస్తోంది.
బీజేపీపై వ్యాఖ్యలు చేసేటప్పుడు సమన్వయం పాటించాలన్నారు. విమర్శలతో ఇరు పార్టీలకూ నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. రెండు పార్టీల నేతలు తిట్టుకుంటుంటే ప్రజల్లో, విపక్షాలకు చులకనైతామని హితవు పలికారు.

అలాగే, రాజధాని అమరావతి ప్రాంతంలో మిగిలిన రైతులు కూడా భూమిని స్వచ్ఛందంగా ఇచ్చేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు. అందుకోసం ప్రజాప్రతినిధులు స్వయంగా వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పాలని తెలిపారు.
రాజధాని భూమి కోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పత్తిపాటి బుధవారం చెప్పిన విషయం తెలిసిందే. అయితే, తొలుత రైతులను ఒప్పించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. వివాదం లేకుండా భూములు తీసుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.
కాగా, బిజెపి నేతల వ్యాఖ్యల పైన ఆచితూచి స్పందించాలని పార్టీ నేతలకు క్లాస్ తీసుకోవడం వెనుక కారణం ఉందని అంటున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉండేనే ఏపి అభివృద్ధికి నిధులు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ కోసం బిజెపితో కలిసి సాగడమే మేలని ఆయన చెబుతున్నారు.












Click it and Unblock the Notifications