టిఆర్ఎస్‌తో కలిసి జగన్ కుట్ర: బాబు, ఆంధ్రుల ద్రోహి జగన్: సోమిరెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరోధకుడిగా మారారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో రెండు రోజులపాటు జగన్ చేపట్టిన దీక్షకు ధీటుగా స్పందించాలని టిడిపి శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
బుధవారం ఉదయం అనంతపురం జిల్లాలో జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి బయలుదేరే ముందు మంత్రులు, ఏపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలతో బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకే జగన్ దీక్ష చేపట్టారన్నారు. మరోవైపు జగన్ టీఆర్‌ఎస్‌తో కలిసి కుట్రలు చేస్తున్నారని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడమే ఇందుకు నిదర్శనమని నేతలకు వివరించారు.

కేసీఆర్, జగన్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని కాన్ఫరెన్స్‌లో నిర్ణయించారు. దీంతో పాటు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కూడా చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రూపొందించుకోవాలని, ఇన్‌చార్జి మంత్రులు ఈ బాధ్యతలను తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.
ఆరేడు నెలల్లో పట్టి సీమ నిర్మాణం
ఆరు ఏడు నెలలో పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో బుధవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు గొట్లూరు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. చెక్‌డ్యాంలు, ఊట చెరువుల నిర్మాణం, పాలాల్లో గుంటలు తవ్వడం ద్వారా వర్షపు నీటిని సంరక్షిస్తామని తెలిపారు.
చిత్రావతి నదిపై 4 చెక్‌డ్యాంలు నిర్మాస్తామని ఆయన వెల్లడించారు. జిల్లాలో 90 శాతం రాయితీతో తుంపర్లు, బిందు సేద్యం పరికరాలు ఇస్తామన్నారు. ఇక్రిశాట్ ఆధ్వర్యంలో భూసార పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 60 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు చెప్పారు.
ఐదు కోట్ల ఆంధ్రులను ఇబ్బందుల పాలు చేసిన కెసిఆర్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ పార్టీ నేత జగన్ సీమాంధ్రుల ద్రోహిగా మారారని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
కెసిఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకునేందుకు కారణం ఎవరని ఆయన అడిగారు. తెలంగాణలో ప్రతిపక్షం గొంతు నొక్కితే తెలుగుదేశం పార్టీ లేకుండా పోతుందా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications