పుష్కర పనుల్లో జాప్యం: పనిచేయని అధికారులకు గుణపాఠం చెబుతానన్న బాబు
రాజమండ్రి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లను సమీక్షించారు. పుష్కర పనుల్లో జాప్యం జరుగుతుండటంతో మండిపడ్డారు. పుష్కరాల్లో పనిచేయని అధికారులకు గుణపాఠం చెబుతానని అన్నారు.
ముందుగా రాజమండ్రి విమానాశ్రయంలో దిగిన చంద్రబాబు అక్కడ జరుగుతున్న పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రహదారి పనులను, రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద సుందరీకరణ పనులను పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి పుష్కరాల పనులను సమీక్షించారు. రాజమండ్రి పశువుల ఆసుపత్రి సమీపంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లను సస్పెన్షన్ చేశారు. బారికేడ్‌ల కోసం రహదారులను ఎలా పడితే అలా తవ్వడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మురుగునీరు గోదావరిలోకి వెళ్లకుండా తరలించే పనులు సరిగా లేవంటూ కమిషనర్ మురళిపైనా సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుష్కరాలు దగ్గరికి వస్తున్నా పనులు పూర్తి కాకపోవడంపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రాజమండ్రి పర్యటనలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వెంట ఉన్నారు. ఇక గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.
వృద్ధుల కోసం వీల్‌చైర్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications