తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్- ఓట్లు చీల్చేందుకే షర్మిల- చంద్రబాబు వ్యాఖ్యలు..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇప్పటివరకూ సీఎం జగన్ ను, ఆయన పార్టీ వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తొలిసారిగా వైఎస్ షర్మిలనూ టార్గెట్ చేశారు. అన్నా చెల్లెళ్ల రాజకీయంపై ఇవాళ పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన ప్రజాగళం సభలో విమర్శలు గుప్పించారు. పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ అంటూ తన పాత డైలాగ్ ను మరోసారి ప్రయోగించారు.
రాష్ట్రంలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయంటూ చంద్రబాబు.. కాంగ్రెస్, వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. కుమారుడు జగన్ కి ఏపీ, కుమార్తె షర్మిలకు తెలంగాణను తల్లి విజయమ్మ రాసిచ్చారని చంద్రబాబు ఆరోపించారు. కానీ ఆమె ఇద్దరు పిల్లలకీ న్యాయం చేయలేదన్నారు. ఇక రాష్ట్రానికేం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) ఓట్లు చీల్చాలని తల్లి కాంగ్రెస్ (కాంగ్రెస్) నాటకం ఆడుతోందన్నారు.

వైఎస్ షర్మిల జగన్ పై చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలంటూ చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి పడే ఓట్లను చీల్చాలని జగన్, షర్మిల ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ కేంద్రంలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరమన్న ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టకున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు..












Click it and Unblock the Notifications