చంద్రబాబు నేరుగా హైదరాబాద్‌కే, తిరుపతి పర్యటన రద్దు: టీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబరాలు
అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలను ఎవరినీ కూడా చంద్రబాబు కలవరని చెప్పారు.
చంద్రబాబు నాయుడు.. జగన్ పెట్టిన అక్రమ కేసుల వల్ల 52 రోజులపాటు జైలులో ఉన్నా.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా అక్రమ అరెస్టును నిరసిస్తూ వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు అచ్చెన్నాయుడు. నేడు మన నాయకునికి బెయిల్ రావడం మనతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు వివిధ దేశాల్లోని తెలుగు పౌరులకు సంతోషకరమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఇదే స్ఫూర్తి ముందు కూడా కొనసాగించాలన్నారు.

కార్యకర్తలు, నాయకులు ఈ విషయం గమనించాలని అచ్చెన్నాయుడు కోరారు. తిరుపతి పర్యటనను చంద్రబాబు రద్దు చేసుకున్నారని తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. అయితే, అంతకుముందు ఉదయం పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతారని తెలిపారు. కానీ, హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన పార్టీ నేతలతో సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.
కాగా, చంద్రబాబును వైద్య పరీక్షలకు వెంటనే హైదరాబాద్ తీసుకురావాలని కుటుంబసభ్యులకు వైద్యులు సూచించారు. దీంతో తిరుపతి పర్యటనను రద్దు చేసుకుని.. బుదవారం ఉదయం నేరుగా హైదరాబాద్ బయల్దేరనున్నారు చంద్రబాబు.
చంద్రబాబు విడుదలతో తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబరాలు
చంద్రబాబు విడుదలైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఏపీతోపాటు తెలంగాణలోని టీడీపీ శ్రేణులు పటాసులు కాల్చుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా చంద్రబాబు విడుదలవడంతో సంతోషం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. రాజమండ్రి జైలు నుంచి బాబు విడుదల సందర్భంగా.. లాకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన సంబరాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
మరోవైపు, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో.. చంద్రబాబు విడుదలైనందుకు గానూ బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. కోకాపేట్ మూవీ టవర్స్, కూకట్‌పల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన సందర్భంగా టీడీపీ మద్దతుదారులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. నిజం గెలిచిందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications