వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్రగడ కాపు గర్జనకు చంద్రబాబు కౌంటర్: రంగంలోకి సినీ దర్శకుడు వివి వినాయక్

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం జనవరి 31వ తేదీన తూర్పు గోదావరి జిల్లా తునిలో తలపెట్టిన కాపు గర్జన సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతివ్యూహం రచించారు. సినీ దర్శకుడు వివి వినాయక్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప ద్వారా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయించి, కాపులకు ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో వివరించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు.

ముద్రగడ నేతృత్వంలోని కాపునాడు నేతల ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం అదే కులానికి చెందిన నేతలను రంగంలోకి దించింది. ప్రభుత్వం కాపులకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించటంతో పాటు గత ప్రభుత్వాలు కాపులను అణగదొక్కిన వైనాన్ని కూడా వివరించేందుకు సమాయాత్తమవుతోంది. ఉన్నతస్ధాయిలో జరిగిన ఓ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడుల ఆహ్వానం వంటి సవాళ్లను ఎదుర్కునే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో చంద్రబాబు ప్రభుత్వానికి కాపునాడు రూపంలో మరో సవాల్ ఎదురైంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పటంతో పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామని ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన సభలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

Chandrababu to counter Mudragada's kapu garjana

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్పకు హోమ్ మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కాపులను బీసీల్లో చేర్చే అంశం పై మంత్రి వర్గంలో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు కర్నాటక హైకోర్టు రిటైర్డ్ జడ్జి మంజునాథన్‌ను కాపు కమిషన్ చైర్మన్ గా నియమించారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఒక వైపు ప్రభుత్వం చెబుతుండగా, తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నప్పటికీ కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని, తమను నిర్లక్ష్యం చేస్తుందని, ఈ నెల 31వ తేదీన తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపునాడును ఏర్పాటు చేశారు.

కాపునాడు సభ ఏర్పాటుకు వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పరోక్ష మద్దతు ఉందని ప్రభుత్వానికి కొంత మంది సమాచారం ఇచ్చారు. దీంతో కాపునేతలను ప్రభుత్వం రంగంలోకి దించింది. తాము గతంలోను, ఇప్పుడు కాపులకు ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటో వివరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్ణయించారు. ఇందుకోసం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయలను రంగంలోకి దించారు.

నెలాఖరు వరకు కూడా అన్ని జిల్లాలకు వెళ్ళి కాపు పెద్దలను, యువకులను కలసి ఏమి చేశామనేది వివరించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఓ కులం కాపులను అణగదొక్కిందని, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ విమర్శించారు. కాపులకు రెడ్లు చేసిందేమీ లేదని కూడా ఆయన విమర్శించారు. ఆయన ఇచ్చిన రెడ్ల జాబితాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పేరు కూడా ఉంది.

టిడిపి శాసనసభ్యుడు బొండా ఉమా కూడా విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కాపులకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రాధాన్యత కల్పించిందనేది వివరించారు. ఇదే అంశం పై హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా గళం విప్పారు. ఈ సమయంలోనే కాపునాడు సభకు అనుమతి ఇవ్వటమా లేదా అనేది తర్వాత ఆలోచించాలని, తూర్పు గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, రాష్ర్ట వ్యాప్తంగా కాపులకు తెలుగుదేశం పార్టీలోను, ప్రభుత్వంలోను ఇచ్చిన ప్రాధాన్యతను వివరించాలనే నిర్ణయానికి వచ్చారు.

సినీ దర్శకుడు వి.వి.వినాయక్‌తో వేదిక పంచుకుని ప్రభుత్వానికి అండగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిన్నరాజప్ప సినీ దర్శకుడు వివి వినాయక్‌ను కోరారు. ఇదే జిల్లాకు చెందిన అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఉపనేత జ్యోతుల నెహ్రూ, ముద్రగడ పద్మనాభంలు రాజకీయంగా ఆగర్భశత్రువులు. అయినప్పటికీ పార్టీ కాపునాడుకు మద్దతు ఇస్తుండటంతో తాను కూడా మద్దతు ఇస్తానని జ్యోతుల నెహ్రూ ఇటీవల కిర్లంపూడి నుంచి తన వద్దకు వచ్చిన కాపునేతలతో చెప్పారు.

English summary
In a counter strategy to face Mudragada Padmanabham, Telugu Desam party chief and Andhra Pradesh CM Nara Chandrababu Naidu is inviting Telugu film director VV Vinayak to speak for his government on Kapu issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X