అమరావతిపై నేడు కీలక నిర్ణయాలు-ఐఐటీల ఎంట్రీ-కంపెనీలకు చంద్రబాబు క్లారిటీ..!
ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ కీలక అడుగులు పడబోతున్నాయి. ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో గత ఐదేళ్లుగా అమరావతి కోసం పోరాటాలు చేసిన కూటమి పార్టీలు ఇప్పుడు అదే రాజధానిని పరుగులు తీయించాల్సిన పరిస్ధితి నెలకొంది. దీంతో అమరావతి రాజధానిలో ఇప్పటికే ఉన్న నిర్మాణాల పరిస్ధితి తేల్చడంతో పాటు కొత్తగా ఏయే కంపెనీలను ఆహ్వానించాలనే దానిపై సీఎం చంద్రబాబు సాయంత్రం కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.
ఏపీ రాజధానిగా ఎంపికైన తర్వాత అమరావతిలో చేపట్టిన నిర్మాణాల పురోగతిని తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సూచనలు, సలహాలిచ్చేందుకు ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ నిపుణులు ఇవాళ రానున్నారు. రెండు ఐఐటీల నుంచి వచ్చే వేర్వేరు బృందాలు.. గతంలో మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాల సామర్ధ్యాన్ని అధ్యయనం చేయనున్నాయి. ముఖ్యంగా ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలను ఐఐటి మద్రాస్ నిపుణులు పరిశీలించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల క్వార్టర్లు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు క్వార్టర్లను ఐఐటి హైదరాబాద్ నిపుణులు పరిశీలించనున్నారు.అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.

అలాగే సాయంత్రం 4.30కి సీఎం చంద్రబాబు మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. ఇందులోనూ రాజధాని పనుల పురోగతిపై సమీక్షిస్తారు. ఈ సమీక్ష తర్వాత సీఆర్డీయే సమావేశం ఉంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో రాజధాని పరిధిలో భూములిచ్చిన కొన్ని సంస్థలకు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువు పొడిగించే అంశంపై చర్చిస్తారు. అలాగే రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చే కంపెనీల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలు కంపెనీలు అమరావతిలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. వీటిలో ఎవరెవరికి అనుమతి ఇస్తారో ఇవాళ తేలిపోనుంది.












Click it and Unblock the Notifications