కుప్పంలో చంద్రబాబు టూర్-సమస్యలపై ఆరా-తాను చేసిన అభివృద్ధి గుర్తు చేస్తూ...
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పాగా వేసేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ ఇవాళ ఆయన మూడు రోజుల టూర్ ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి కుప్పం చేరుకున్నారు. కుప్పంలో స్ధానికంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా జనం కుప్పంలో సమస్యల్ని చంద్రబాబు దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా కుప్పంలో వైసీపీ నేతల రౌడీయిజంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇది పులివెందుల కాదని, కుప్పమని వారికి స్పష్టం చేశారు. ధర్మానికి ధర్మం, న్యాయానికి న్యాయం ఉంటుందని, రౌడీయిజం చేస్తామంటే రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. పోలీసులు ఓ రాజకీయ పార్టీతో పెట్టుకుంటున్నారని, ఖబడ్డార్ అని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. న్యాయం చేయండి, మీ పని మీరు చేయండి, వైసీపీకి పని చేస్తే మాత్రం మా కార్యకర్తలు రెచ్చిపోతే మీరు తట్టుకోలేరన్నారు. పోలీసులకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా, మాట్లాడితే ఎఫ్ఐఆర్ అంటున్నారు. మీకు ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలుసా అని చంద్రబాబు ప్రశ్నించారు.

న్యాయానికి భయపడతా, చట్టానికి లోబడతా, రౌడీలకు భయపడేది లేదని చంద్రబాబు వైసీపీ నేతలకు స్పష్టం చేశారు.
తొమ్మిదేళ్లలో తాను వైసీపీ నేతల్ని టచ్ చేయలేదని, తమ వాళ్లను టచ్ చేస్తే ఊరుకునేది లేదని బాబు హెచ్చరించారు.మీ ప్రభుత్వం ఎక్సపెయిరీ డేట్ లో ఉందని వైసీపీ నేతలకు చంద్రబాబు తెలిపారు. అందుకే రౌడీయిజం చేయాలనుకుంటున్నారన్నారు. రౌడీయిజంచేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

తాను గతంలో కుప్పంలో ఎప్పుడైతే డ్రిప్ ఇరిగేషన్ తెచ్చానో అప్పుడే ఇక్కడ అభివృద్ధి మొదలైందని చంద్రబాబు స్ధానికులకు గుర్తుచేశారు. రోడ్లు వేయించామని, సంక్షేమానికి మారుపేరుగా కార్యక్రమాలుచేశామన్నారు. పేదలు, పిల్లల సంక్షేమం కోసం ఎన్నో చేశామన్నారు. ఆనాడు బ్రిడ్జిలు కట్టినా, చెక్ డ్యామ్ లు వేసినా టీడీపీ చేసినవేనన్నారు. ఇవి వైసీపీ చేసినవి కావని గుర్తుచేస్తున్నానన్నారు. కుప్పంలో సమస్యలపై ఇప్పుడే ప్రభుత్వానికి లేఖ రాస్తానని స్ధానికులకు ఆయన హామీ ఇచ్చారు. చేయకపోతే మన ప్రభుత్వం రాగానే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications