2018 నాటికి రాజధాని తొలి దశ పూర్తి
గుంటూరు: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా, నేడు మళ్లీ సీఎంగా సేవ చేసే అవకాశం తనకు ప్రజలు కల్పించారని, అలాంటిది అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు తన పైన ఎంతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, వాళ్లు ఎన్ని తిట్టినా భరిస్తానని, రోషం లేక కాదని, తనను నమ్మి గెలిపించిన ప్రజల కోసమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, ముఠా కక్షలను అణిచివేస్తానని చెప్పారు.
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని అనంతవరంలో శనివారం జరిగిన ఉగాది పండుగ వేడుక నుంచి ప్రజా రాజధాని నిర్మాణానికి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ రాజధాని నాది, దేశం, భావితరాల కోసం నేను దీని నిర్మాణంలో పాలుపంచుకొంటున్నానన్న భావన ప్రతి ఒక్కరిలో కలగాలన్నారు.
ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా, విఘాతాలు కలిగించినా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 33 వేల ఎకరాల భూములు ఇచ్చారని కితాబిచ్చారు. వారి త్యాగాలను మరిచిపోమన్నారు. ప్రజల భాగస్వామ్యంతో 2018 జూన్ రెండో తేదీ నాటికి రాజధాని తొలి దశ నిర్మాణం పూర్తి చేసి తీరుతామని చెప్పారు. చేశారు.

ప్రధాన రాజధాని నిర్మాణం పూర్తవుతూనే విజయవాడ, గుంటూరు, తెనాలి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి తదితర పట్టణాలు రాజధానిలో కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక విశ్వనగరంగా రూపాంతరం చెందుతుందని వివరించారు. ఆయా పట్టణాలు, నగరాల నుంచి రాజధానికి అరగంటలో చేరేలా ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం చేపడతామన్నారు. వాన్‌పిక్, మచిలీపట్నం పోర్టులను అభివృద్ధి చేసుకొంటే ప్రపంచమే ఇక్కడికి వస్తుందన్నారు.
ఎంతోమంది త్యాగాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను ఎంతమంది పరిపాలించినా తెలుగు వారికి చిరస్థాయిగా గుర్తుండిపోయేది ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారన్నారు. జరిగిందేదో జరిగింది. పోయిన దానిని మళ్లీ తీసుకోలేమన్నారు. కసి, కోపం, పట్టుదలతో అభివృద్ధి చేసుకుందామన్నారు.
ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని కృష్ణానదీ తీరాన నిర్మించాలనే తన సంకల్పానికి వేలాదిమంది రైతులు బలాన్నిచ్చారన్నారు. ఒకదశలో ఆయన ఉద్వేగానికి గురై నవ్యాంధ్రలో తొలిసారిగా జరుపుకుంటున్న ఉగాది తెలుగువారి శక్తియుక్తులను, సత్తా, సామర్థ్యాలను నిరూపించేందుకు తిరుగులేని పండుగ కావాలన్నారు.
భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. ఎవరు ఎన్ని అవరోధాలు సృష్టించినా తట్టుకుని నిలబడి దూసుకెళ్లే సత్తా తనకుందంటూ, ఏది ఏమైనా 2018 జూన్ మాసానికి రాజధాని నిర్మాణంలో తొలిదశ పూర్తిచేస్తానంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
రాజధానిని ఎక్కడ నిర్మించాలో నాటి పాలకులు పేర్కొనలేదన్నారు. అయినా 13 జిల్లాలకు నడిబొడ్డులో ఉండాలనే ఉద్దేశంతోనే కృష్ణాతీరాన ఉన్న తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 7,600 చదరపు కిలోమీటర్ల పరిధిని సిఆర్‌డిఏ పరిధిలోకి తెచ్చామన్నారు.
పూర్వకాలంలోనే అమరావతి వంటి అద్భుత రాజధాని నగరాలు నిర్మించిన ఘనత తెలుగువారికి ఉందన్నారు. ఎన్టీఆర్స్ఫూర్తితోనే తాను ముఖ్యమంత్రిగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు దీటుగా సైబరాబాద్‌ను నిర్మించి ప్రపంచ నగరాల్లో ఒక నగరంగా గుర్తింపు తీసుకురాగలిగానని అదేరీతిలో నవ్యాంధ్రలో కూడా రాజధాని నగరంతో పాటు విశాఖ, తిరుపతి నగరాలను తీర్చిదిద్దగలనని చెప్పారు.
ఆర్థిక లోటుతోపాటు అనేక సమస్యలున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కనీసం రాజధాని నిర్మాణానికి కూడా సహకరించకుండా రైతులను రెచ్చగొట్టేందుకు ఎంతగానో ప్రయత్నించిందని, అదృష్టవశాత్తూ తనపై విశ్వాసంతో ఎవరూ రెచ్చిపోలేదన్నారు. రాయలసీమకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో సముద్రంలో కలిసే గోదావరి జలాలను కుడికాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించడానికి తాను ప్రయత్నిస్తుంటే దానికి కూడా రాజకీయం చేస్తున్నారన్నారు.
ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అక్కడ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసుకుని గోదావరి జలాలను వినియోగించుకోవాలని తాను మొదటి నుంచి కూడా కోరుతున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని సహించేది లేదంటూ తీవ్రంగా హెచ్చరించారు.












Click it and Unblock the Notifications