పక్కా వ్యూహంతో..: మోడీని డిఫెన్స్‌లో పడేసిన చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం పైన ఒకింత పైచేయి సాధించారా? నిన్నటి దాకా ప్రత్యేక హోదా పైన విపక్షాలు విమర్శలు గుప్పించాయి.. ఇప్పుడు ఆయన వారికి కౌంటర్ ఇచ్చినట్లేనా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీని ఆత్మరక్షణలో పడేశారంటున్నారు.
ఢిల్లీ పర్యటన ద్వారా చంద్రబాబు రాజకీయంగా బీజేపీ పైన, అలాగే ప్రతిపక్షాల పైచేయి సాధించారని అంటున్నారు. దాదాపు మూడు రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు చేసిన చంద్రబాబు... పక్కా వ్యూహం రచించుకుని ఢిల్లీకి వెళ్లారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా 12 అంశాలపై 18 పేజీల నివేదికను ప్రధాని మోడీకి అందించారు.
చంద్రబాబు పక్కా వ్యూహంతో ప్రధాని మోడీని, బీజేపీని ఆత్మరక్షణలో పడేశారని అంటున్నారు. వెరసి ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇతర అంశాలపై ఆయన స్పష్టమైన హామీని పొంది బయటకు వచ్చారు. హోదా అంటూ ప్రధాని మోడీ ఎక్కడా ప్రస్తావించకున్నా ఏపీకి అవసరమైన అన్నీ చేస్తామంటూ చంద్రబాబుకు భరోసా ఇచ్చారు.

అయితే తన వ్యూహంలో భాగంగా మోడీ ముందు చంద్రబాబు మాట్లాడిన పలు కీలక వ్యాఖ్యలను విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ తెలుగు దినపత్రిక నేటి తన సంచికలో ఆసక్తికర కథనాన్ని రాసింది.
ఈ కథనం ప్రకారం... ప్రధాని మోడీ ముందుకు వెళ్లగానే తన వెంట తీసుకెళ్లిన 18 పేజీల వినతి పత్రాన్ని చంద్రబాబు ప్రధానికి అందజేశారు. ఆ తర్వాత నోరు తెరచిన చంద్రబాబు వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు. 'ప్రత్యేక హోదా మా హక్కు. దానిని ఇవ్వాల్సిందే. నీతి ఆయోగ్ ఒప్పుకోలేదనో, ఆర్థిక సంఘం చెప్పలేదనో దానిని వదులుకోలేం. హోదా ఇవ్వకపోతే పార్లమెంటుపైనే ప్రజలకు విశ్వాసం పోతుంది.
అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మీరు ఉభయులూ కలిసి ఏపీకి హోదా ఇస్తామని వాగ్దానం చేశారు. అన్ని పార్టీలూ ఆమోదించాయి. ఇంత జరిగిన తర్వాత వెనక్కు వెళ్లడం మీ ప్రతిష్ఠకు మంచిది కాదు. ఏడాదికి రూ.60 వేల కోట్లిచ్చే రాజధాని హైదరాబాదును మేం కోల్పోయాం. దేశంలో ఇంత ఇబ్బందికర పరిస్థితిని ఏ రాష్ట్రం ఎదుర్కోలేదు. అందుకే హోదా అడుగుతున్నాం. త్వరగా ఇవ్వండి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అలాగే, నిధుల విషయంలో కేంద్రం ఇచ్చినవి, వాటి లెక్కలను చంద్రబాబు ప్రధాని మోడీ ముందు ఉంచారు. తద్వారా, హోదా విషయంలో పూర్తి స్పష్టత లేకున్నా, నిలదీయడం, నిధుల విషయంలో హామీ పొందడం, ఏపీ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నట్లుగా నిధులకు లెక్క చెప్పడం ద్వారా బాబు బీజేపీని సెల్ఫ్ డిఫెన్సులో పడేశారంటున్నారు.
విశాఖలో ఏపీ బీజేపీ సమావేశం
విశాఖలో ఏపీ బీజేపీ సమావేశమైంది. ఈ భేటీకి రాష్ట్ర ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ భేటీకి 13 జిల్లాల ఇంఛార్జులు, ఏపీ అధ్యక్షులు హరిబాబు తదితరులు హాజరయ్యారు. టిడిపితో సయోధ్యను కొనసాగిస్తూనే ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications