డ్వాక్రా ఛార్జీలు, టిడ్కో, ఎంఎస్ఎంఈ రుణాలు-బ్యాంకర్లకు చంద్రబాబు వినతులు..!
రాష్ట్రంలో క్రెడిబులిటీ, బ్రాండింగ్ కు ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నట్లు సీఎం చంద్రబాబు (chandrababu) ఇవాళ వెల్లడించారు. అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బ్యాంకర్ల ముందు పలు ప్రతిపాదనలు పెట్టారు. అలాగే బ్యాంకర్లు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా పరిశ్రమలు ప్రారంభించే వారికి వివిధ బ్యాంకుల నుంచి మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వానికి క్రెడిబులిటీ ఉంటే తక్కువ వడ్డీలకు రుణాలు తెచ్చుకోవచ్చన్నారు. ఏపీలో రూ.2 లక్షల కోట్ల మేర రుణాలను రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశామని, ఇప్పటి వరకు రూ.49 వేలకోట్లు రీ షెడ్యూల్ చేసి 1108 కోట్లు ఆదా చేశామన్నారు.
ఎస్ఎంఎంఈలకు రుణాలు కోరిన చంద్రబాబు
ఎంఎస్ఎంఈ రంగాన్ని ఎక్కువ ప్రొత్సహించాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి సూచించారు. అలాగే వివిధ కీలక రంగాలు అభివృద్ధి జరిగేలా బ్యాంకర్ల సహకారం కావాలన్నారు. వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎంఎంస్ఎంఈల ప్రొత్సహంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలమన్నారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానంతో ముందుకెళ్తున్నామని, సర్వీస్ సెక్టార్ పుంజుకునేందుకు ప్రణాళికలతో వెళ్తున్నామని తెలిపారు. పీపీపీ ప్రాజెక్టులకు వీజీఎఫ్ ఇచ్చేందుకు కేంద్రం కూడా సిద్దంగా ఉందన్నారు.

ఇన్నోవేషన్ హబ్ లకు బ్యాంకుల రుణాలు
అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కార్యాలయానికి సాయం చేయనున్నట్లు యూనియన్ బ్యాంక్ తెలిపింది. అలాగే రాజమండ్రి స్పోక్ హబ్‌కు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, అనంతపురం స్పోక్ హబ్‌కు కెనరా బ్యాంక్, విశాఖ స్పోక్ హబ్‌కు పీఎన్బీ, తిరుపతి స్పోక్ హబ్‌కు ఇండియన్ బ్యాంక్, విజయవాడ స్పోక్ హబ్‌కు హెచ్డీఎఫ్సీ బ్యాంకులు సహకారం ఇవ్వాలని నిర్ణయించాయి.
ప్రైవేటు రుణాలు లేకుండా మీరే ఇవ్వండి
రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదని ఈ సందర్బంగా చంద్రబాబు తెలిపారు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి రావాలన్నారు. బ్యాంకర్లు ఆ దిశగా పని చేయాలన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వాలని కోరారు. వారి కోసం ప్రభుత్వాలుగా తాము చేయాల్సింది చేస్తున్నామని, బ్యాంకర్ల వైపు నుంచి సహకారం ఉండాల్సిందేనన్నారు.

టిడ్కో రుణాలు, డ్వాక్రా ఖాతాలపై ఛార్జీల తగ్గింపు
టిడ్కో ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని,
ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకర్లు అంగీకరించడం లేదని చంద్రబాబు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి మావైపు నుంచి ప్రయత్నిస్తున్నామని, దీనికి బ్యాంకర్లు కూడా సహకరించాలన్నారు. డ్వాక్రా గ్రూపు బ్యాంక్ ఖాతాలపై 15 రకాల ఛార్జీలు వేస్తున్నారని, బ్యాంకర్లు ఈ ఛార్జీలను తగ్గించాలని కోరారు. బ్యాంక్ ఖాతాల కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని బ్యాంకులు కూడా ప్రవేశపెడితే బాగుంటుందేమో ఆలోచించాలన్నారు.












Click it and Unblock the Notifications