వార్ రూం కాదు: కెసిఆర్‌పై చంద్రబాబు మళ్లీ పైర్
న్యూఢిల్లీ: సమస్యల పరిష్కారానికి వార్‌రూమ్‌లు కాదని పీస్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హితవువ పలికారు. ముఖ్యమంత్రి అవుతున్న వ్యక్తి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి పదవి చేపట్టిన అశోక్ గజపతి రాజుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రెచ్చగొట్టే పద్దతులు మానుకోవాలని ఆయన కెసిఆర్‌కు సూచించారు.
సీట్లు,ఓట్ల కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. సీమాంధ్రకు మొదటి నెల నుంచే ఆర్థిక లోటు వుంటుందని, సీమాంద్రను కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పునాదుల నుంచి సీమాంధ్ర అభివృద్ధి జరగాలన్నారు. ఢిల్లీ కన్నా సీమాంధ్రను అభివృద్ది చేస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన అప్పులను రెండు రాష్టాలకు పంచినట్లు తెలిపారు. మంత్రి పదవులు ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

సీమాంధ్ర అభివృద్ది, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై మోడీ హామీ మేరకు అభివృద్ది జరుగుతుందని ఆయన అన్నారు. నూతన ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం సమర్దవంతంగా ముందుకు వెళుతుందన్నారు. దేశ,రాష్ట్ర ప్రయోజనాలకోసమే ఏన్డీయేతో తమ పార్టీ చేరిందన్నారు. తాము ఎప్పుడు పదవుల కోసం పాకులాడలేదన్నారు. తర్వాత జరిగే విస్తరణలో తెలంగాణ ప్రాంతానికి అవకాశం ఉంటుందన్నారు.
రైతు వ్యతిరేక విధానాలు, స్కామ్‌లు కాంగ్రెస్ పార్టీకి ఓటమికి కారణమన్నారు. విభజన అంశంలో తాము సమన్యాయం పాటించమన్నామని తావు చెప్పినట్లు వినక పోవడంతోనే కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి పట్టిందన్నారు. సీమాంద్రలో పోలవరం తదితర అంశాలపై కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు.
విభజనపై సీఎస్ ఇచ్చిన ప్రజంటేషన్ గందరగోళంగా ఉందని దీనిపై అన్ని విధాలుగా చర్చిస్తామన్నారు. తెలుగుదేశంలో సుదీర్ఘకాలంగా ఉన్న అశోక్ గజపతి రాజును కేంద్ర మంత్రి వర్గంలో తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా 15 ఏళ్ళకు పెంచాలని కోరినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications