తొలిసారి బాబు: కెసిఆర్‌పై మోత్కుపల్లి, కృష్ణయ్యల ఫైర్
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తొలిసారి వరంగల్ జిల్లాకు వచ్చారు. జిల్లాలోని హన్మకొండలో ప్రజాగర్జన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబుకు జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ప్రజాగర్జనలో టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మండిపడ్డారు. తెలంగాణ కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. కెసిఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వాలని లేఖ ఇచ్చింది టిడిపియేనని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్ వల్ల తెలంగాణ రాలేదన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కెసిఆర్ వ్యతిరేకి అన్నారు.

టిడిపి అధికారంలోకి వస్తే బిసి ముఖ్యమంత్రి అవుతాడని ఆర్ కృష్ణయ్య అన్నారు. బిసి ముఖ్యమంత్రి అయితేనే బిసిలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పుడు తప్పితే మళ్లీ బిసిలకు మరో అవకాశం రాదన్నారు. టిడిపి మడమ తిప్పని పార్టీ, మాట తప్పని పార్టీ అన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. బాబు వల్లే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. బిసిని సిఎం చేస్తామన్న టిడిపిని గెలిపించాలన్నారు.
తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం ఏమైనా ఆత్మహత్య చేసుకుందా అని రమేష్ రాథోడ్ ప్రశ్నించారు. తాను, నామా నాగేశ్వర రావు లోకసభలో తెలంగాణ గురించి పోరాడామన్నారు. కెసిఆర్ ఒక్క ప్రశ్న అడిగిన సందర్భం లేదన్నారు.












Click it and Unblock the Notifications