వరంగల్ బయలుదేరిన బాబు: టీడీపి సభా వేదికకు నిప్పు
వరంగల్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి వరంగల్ బయలుదేరారు. ఆయన రోడ్డు మార్గంలో వరంగల్ చేరుకుంటారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వరంగల్ జిల్లా పర్యటన వేడి పుట్టిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తొలిసారి గురువారంనాడు తెలంగాణలో అడుగు పెడుతున్నారు. ఎన్నికల ముందు ప్రచారం చేసినా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆయన ఇంతవరకూ రాష్ట్రంలో పర్యటించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిది నెలల సమయం తీసుకొని తన పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈ వరంగల్‌లో జిల్లాస్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం, ఆ తర్వాత విడివిడిగా నియోజకవర్గాల సమీక్షలో పాల్గొంటారు.
వరంగల్‌లోని తెలుగుదేశం పార్టీ వేదికకు నిప్పు పెట్టారు. ఎమ్మార్పీయస్ కార్యకర్తలే వేదికకు నిప్పు పెట్టారని భావిస్తున్నారు. సభా వేదిక దగ్ధమైంది. టిడిపి వర్గాలు మంటలను ఆర్పాయి. కాగా, వరంగల్ జిల్లాలో ఖాజీపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మార్పీయస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని గత వారం రోజులుగా ఎమ్మార్పీయస్ డిమాండ్ చేస్తోంది. గత రాత్రి ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. రోడ్లపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జెండాలను కూడా దగ్ధం చేశారు. వరంగల్‌కు చంద్రబాబు ఖాజీపేట మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది.

వరంగల్ పర్యటనకు చంద్రబాబు నాయుడు రోడ్డు మార్గంలో బయలుదేరుతున్నారు. మార్గమధ్యంలో ఎమ్మార్పీయస్ కార్యకర్తలు ఆయనను అడ్డుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో సభా వేదిక సిద్దమైంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ వరంగల్ జిల్లా నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఎవరు అడ్డుపడినా సభ జరుగుతుందని ఆయన చెప్పారు.
చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బుధవారంనాడు హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మాటతప్పారని ఆరోపించారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే తమ నిరసనను చవిచూడాల్సి వస్తదని మందకృష్ణ హెచ్చరించారు.
కాగా, ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పర్యటనను అడ్డుకోవద్దని ఆయన మందకృష్ణ మాదిగను కోరారు. రేపటి చంద్రబాబు వరంగల్ పర్యటనకు ఎమ్మార్పీయస్ సహకరించాలని ఆయన అన్నారు. రైతు కుటుంబాలను ఆదుకునే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు వరంగల్ పర్యటనకు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం, టీడీపీ శ్రేణులను పునరేకీకరణ చేయడమే బాబు పర్యటన లక్ష్యమన్నారు.












Click it and Unblock the Notifications