ఇదే లాస్ట్... టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్..!
ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో సంక్షేమంతో పాటు పలు రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పార్టీలు గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధుల్ని కూడా విడుదల చేశారు. తద్వారా విపక్షానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన చంద్రబాబు వారికి కీలక ఆదేశాలు ఇచ్చారు.
అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు..ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్డెట్ లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. బడ్జెట్ ఎలా ఉందో వారికి వివరించారు. అలాగే బడ్జెట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత కూడా ఎమ్మెల్యేలదే అన్నారు. అలాగే కొత్తగా అసెంబ్లికి వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. దీంతో పాటు ఎమ్మెల్యేలకు ఓ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలంటూ చంద్రబాబు వారికి సూచించారు. అలాగే మళ్లీ సభకు రావాలన్న భావనతో ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని కోరారు. అదే సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం కూడా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా విభేదాలు సహించేది లేదంటూ వారికి తేల్చిచెప్పేశారు. గ్రూపులు కడితే ఇబ్బందులు తప్పవని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications