కాంగ్‌లో మంచోళ్లు, అర్థంచేస్కొండి: బాబు, ఎఎపికి వార్న్
హైదరాబాద్: రాష్ట్రంలో ఒక పార్టీ దివాళా తీసి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినప్పుడు అందులో నుంచి కొందరు రావాలనుకోవడం సహజమని, ఆ పరిణామాన్ని పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం టిడిపికి గొయ్యి తీయాలనుకొని చివరకు తానే గోతిలో పడిందని, రాజకీయాల్లో మ్యాచ్ ఫిక్సింగులు, కుట్రలు ఉండకూడదన్నారు.
ప్రజల కోసం చేయాలి తప్ప రాజకీయ స్వార్ధం కోసం చేయకూడదని హితవు పలికారు. వందేళ్ళు సేవ చేసిన పార్టీ చివరకు తమను నిలువునా ముంచిందని ఆ పార్టీలో ఉన్నవాళ్ళే బాధపడుతున్నారని, కాంగ్రెస్‌లో దొంగలు ఎక్కువ మంది ఉన్నా కొందరు మంచివాళ్ళు కూడా ఉన్నారని, అలాంటి వాళ్ళు వస్తే తీసుకుంటామన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు తమ ప్రాణాలు, ఆస్తులు త్యాగం చేసి పార్టీని బతికించుకున్నారని, పంచాయితీ ఎన్నికల్లో తిరుగులేని ఫలితాలు తెచ్చారని, వారికి చెప్పకుండా ఏదీ చేయమన్నారు.

వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలవడం చారిత్రక అవసరమన్నారు. కాంగ్రెస్‌లోని కార్యకర్తలు తమకు తాముగా టిడిపిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో టిడిపి ఉండదని తెరాస నేతలు చేస్తున్న ప్రకటనలను ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధిని తీసుకువెళ్ళిన ఘనత తమదని, హైదరాబాద్‌ను ఉపాధి అవకాశాల కేంద్రంగా మార్చింది తామేనని, ప్రాంతాలకు అతీతంగా తాము ప్రజల గుండెల్లో ఉన్నామన్నారు.
వసూళ్ళలో మునిగి తేలే తెరాస కూడా ఒక పార్టీనా? బ్లాక్ మెయిలింగులకు, వసూళ్ళకు పాల్పడే పార్టీలు చెబితే పోయే పార్టీ కాదు తమదన్నారు. రాష్ట్రపతిని కలిసినప్పుడు రాష్ట్ర విభజన వ్యవహారంపై ఆయన ఏం చెప్పారని అడిగినప్పుడు చంద్రబాబు ఆచితూచి మాట్లాడారు. సమన్యాయం చేయాలని తాను రాష్ట్రపతిని కోరానని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెసు అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన కేజ్రీవాల్ ఆ పార్టీ మద్దతు తీసుకోవడం సరికాదన్నారు. కేజ్రీవాల్ కాంగ్రెసు పార్టీ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అవినీతి గురించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. రాహుల్‌కు ఈ పదేళ్లలో కాంగ్రెస్ హయాంలో దేశంలో జరిగిన అవినీతి కుంభకోణాలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఎపిలో వైయస్ హయాంలో అవినీతిపై పుస్తకాలు వేసి తీసుకెళ్ళి ఇచ్చామని, వ్యాన్‌పిక్‌కు పాతిక వేల ఎకరాల భూములు ఇచ్చి దానికి బదులుగా జగన్‌కు రూ.800 కోట్లు ఇప్పించారని సాక్ష్యాలు ఉన్నాయని, ఒక్కదానిపై అయినా చర్య ఉందా? పైగా జగన్‌కు బెయిల్ ఇప్పించి బయటకు తెచ్చారని, ఇవన్నీ రాహుల్‌కు తెలియవా? అని ధ్వజమెత్తారు.
తన బావ రాబర్ట్ వాద్రాకు ఆకస్మికంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయో తెలియనంత అమాయకుడు కాదని, తెలిసినా రాహుల్ మాట్లాడకుండా ఊరుకొన్నారని విమర్శించారు. గుజరాత్‌లో జరిగిన మతకల్లోలాలు తనను నిలువెల్లా కంపింపచేశాయని మోడీ తన బాధను వ్యక్తం చేశారని, కాని ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్ ఏనాడైనా అటువంటి పశ్చాత్తాపాన్ని ప్రకటించిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications