షాంఘై తరహాలో అమరావతి, 29 ఎంఒయులు: చైనా పర్యటనపై ఖుషీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని చైనాలోని షాంఘై తరహాలో అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. చైనాలో ఉన్నతస్థాయి నాయకులను కలిశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తొమ్మిది రోజుల చైనా పర్యటనకు సంబంధించి వివరాలను సీఎం శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, రాజధాని అమరావతికి ప్రపంచ స్థాయి కంపెనీలు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. షాంఘై మాదిరిగానే అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ఈ అంశమై పర్యాటక రంగం అభివృద్ధిపై చైనాతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.

ప్రపంచంలోనే టాప్ పోర్టుల్లో నాలుగు చైనాలోనే ఉన్నాయన్నారు. చైనాలో టెక్నాలజీ, పరిశోధనలపై ఎక్కువ ఖర్చు పెట్టారని ఆయన వివరించారు. కార్మికుల్లో నైపుణ్యతను పెంచారని, సింగపూర్, చైనాలో ప్రభుత్వ రంగ సంస్థలే ఎక్కువగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో 60 దేశాల్లో వ్యాపారాలు చేయాలని చైనా ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.
చైనా పర్యటన సానుకూల వాతావరణంలో సాగిందని చెప్పారు. భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని చైనా ఉత్సాహంగా ఉందన్నారు. చైనాలో మూడు ప్రాంతాల్లో పర్యటించామని, మెరుగైన సంబంధాల కోసమే ఈ పర్యటన చేపట్టామని అన్నారు. త్వరలోనే ప్రధాని మోడీ చైనాలో పర్యటిస్తారని చెప్పారు.
వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో చైనా ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, రాష్ర్టానికి పరిశ్రమలు వస్తే భూముల విలువ పెరుగుతుందని సీఎం చెప్పారు. భూ నిర్వాసితులు మెరుగైన పరిహారం కోరాలే తప్ప భూ సేకరణకు అడ్డుపడితే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కొందరు రాజకీయ నాయకులు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు.
బీజింగ్, చెంగ్డు, షాంఘైలో పర్యటించామని, అక్కడి పలువురు ప్రముఖులను కలిశామని చంద్రబాబు అన్నారు. దౌత్య సంబంధాలే కాకుండా, వాణిజ్య సంబంధాలపై చర్చించామన్నారు. చైనాలోని వివిధ కంపెనీలతో మొత్తం 29 ఎంవోయూలు కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
గడిచిన 15 ఏళ్లలో చైనా సంపద భారీగా పెరిగిందని, ఈ 15 ఏళ్లలోనే చైనా 68 రెట్లు అభివృద్ధి సాధించిందని బాబు విశ్లేషించారు. బీజింగ్‌లో ప్రపంచ స్థాయి సంస్థలు, పరిశ్రమలు ఉన్నాయన్నారు. షాంఘైలో అత్యంత వేగంగా నడిచే రైల్వే ట్రాక్ ఉందని, చైనాలోని అన్ని రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్టుల మాదిరిగా అభివృద్ధి చేశారని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications