జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ ఇదే: లీక్ చేసిన ఆప్తుడు: టీడీపీ నుంచి కలిసొచ్చేదెవరు..!!
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు సృష్టించిన ప్రకంపనల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తోన్నారు. తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ప్రత్యామ్నాయంగా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెర మీదికి తీసుకొచ్చారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా- జూనియర్ భేటీతో టీడీపీలో చాపకింద నీరులా విస్తరించినట్లు భావిస్తోన్న అసంతృప్తి, అసమ్మతిని ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని చుట్టే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.
Recommended Video

కొడాలి మరోసారి..
ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తన తాత నెలకొల్పిన టీడీపీని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోన్నారని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా కొడాలి నానికి పేరుంది. అలాంటి నాయకుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.

బీజేపీతో పొత్తు..
దీని తరువాత చంద్రబాబు, నారా లోకేష్ పార్టీ నుంచి బయటికి వెళ్తారనీ, చంద్రబాబు, నారా లోకేష్ కలిసి మరో పార్టీ పెట్టుకుంటారని తేల్చి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ చేతికి తెలుగుదేశం పార్టీ వెళ్లిన తరువాత టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని కొడాలి నాని వివరించారు. 2024 ఎన్నికల నాటికి ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని అంచనా వేశారు. ఎన్టీఆర్ టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.

చిత్తు చిత్తుగా..
చంద్రబాబు పెట్టబోయే కొత్త పార్టీ- జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని, ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తారని కొడాలి నాని పేర్కొన్నారు. కొడాలి నాని అడిగారనో, లక్ష్మీపార్వతి చెప్పారనో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలను అందుకోబోరని, ఆయనకంటూ స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని కొడాలి నాని అన్నారు. ఆయన అనుకున్నదే చేస్తారని, సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని తేల్చేశారు.

డిపాజిట్లు కూడా రావు..
చంద్రబాబు-పవన్ కల్యాణ్‌కు 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలే చివరివి అవుతాయని, ఆ ఇద్దరి పీడ విరగడ అవుతుందని కొడాలినాని విమర్శించారు. ఈ రెండు పార్టీలను ప్రజలు ఛీ కొడతారని, కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేరని అన్నారు. వైఎస్ఆర్సీపీ మాత్రం సింగిల్ గానే పోటీ చేస్తుందని కొడాలి నాని అన్నారు. 2019 నాటి ఎన్నికల్లో తమకు 50 శాతం ఓట్లు పోల్ అయ్యాయని, ఈ సారి ఈ సంఖ్య 55 నుంచి 60కి చేరుతుందని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.

ఏడు సార్లు గెలిచి..
ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గంలో చంద్రబాబుపై వ్యతిరేక మొదలైందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు కుప్పంలో డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో చక్రాలు తిప్పాను, రాష్ట్రపతి, ప్రధానమంత్రులను తయారు చేశానని చెప్పుకొనే చంద్రబాబు చివరికి తన సొంత నియోజకవర్గంలో మనుగడ కోసం పోరాడాల్సి వస్తోందని అన్నారు. సొంత పార్టీ కార్యకర్తల దాడులను చంద్రబాబు సమర్థించుకుంటోన్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications