సీఎం జగన్ చేతికి చంద్రబాబు అస్త్రం - ఎన్నికల వేళ సెల్ఫ్ గోల్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారా. మహానాడు వేదికగా చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. జగన్ రూటే కరెక్ట్ అంటూ పరోక్షంగా సర్టిఫికెట్ ఇచ్చేసారు. ముఖ్యమంత్రి ట్రాప్ లో చంద్రబాబు చిక్కుకున్నారు. టీడీపీ తాను అమలు చేస్తున్న సంక్షేమం అడ్డుకుంటున్నారనే ప్రచారం తిప్పికొట్టేందుకు వేసిన ఎత్తుగడ బూమ్ రాంగ్ అయింది. ఇప్పుడు ఎన్నికలు సంక్షేమం కేంద్రంగా జరిగేలా అవకాశం ఇచ్చారు. సహజంగానే అధికారంలో ఉన్న జగన్ కు ఈ అవకాశం అస్త్రంగా మారుతోంది.
నవ్ ఆర్ నెవర్ గా:
రానున్న ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు నవ్ ఆర్ నెవర్ గా తేల్చారు. కురుక్షేత్రంగా అభివర్ణించారు. మహానాడు లో ఎన్నికల సమరశంఖం పూరించారు. ఇదే వేదిక నుంచి ఎన్నికల తొలి విడత మేనిఫెస్టో విడుదల చేసారు. అదిరిపోయే సంక్షేమం అందిస్తామని ప్రకటించారు. మేనిఫెస్టోలో మహిళలు..యువత..రైతులు..బీసీ వర్గాలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేసారు. అక్కడే వ్యూహం బెడిసి కొట్టింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమం పైన టీడీపీ ఇప్పటి వరకు విమర్శలు చేస్తూ వచ్చింది. ఇదే సమయంలో జగన్ తాను అందిస్తున్న సంక్షేమానికి టీడీపీ అడ్డుపడుతోందని..టీడీపీ అధికారంలోకి వస్తే స్కీంలు ఆగిపోతాయని వ్యూహాత్మక ప్రచారం ప్రారంభించారు. సరిగ్గా జగన్ కోరుకున్నదే జరిగింది. జగన్ ట్రాప్ లో చంద్రబాబు పడినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.

సంక్షేమంలో పోటీ:
ముఖ్యమంత్రి జగన్ అందించే సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ అక్కడ ప్రణాళికా లోపం కనిపించింది. అమ్మఒడి పథకమే అమ్మ కు వందనం పేరుతో ప్రకటించినట్లు కనిపిస్తోంది, కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కాపీ కొట్టారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మహిళలకు నెలకూ 1500 ప్రకటనలో స్పష్టత లోపించింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. పథకాలు అందని వారు...అభివృద్ధి అజెండాను చంద్రబాబు ప్రకటన పైన ఆశగా చూసారు. వారికి నిరాశే మిగిలింది. జగన్ బాటలోనే చంద్రబాబు ప్రయాణిస్తున్నారనే అంశం స్పష్టం అయింది. ఇప్పుడు చంద్రబాబు కూడా సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వచ్చేసారు. ఇదే ఇప్పుడు సీఎం జగన్ కు కావాల్సింది.
సీఎం జగన్ కు మేలు చేసేనా:
ముఖ్యమంత్రి కోరుకున్నట్లుగానే చంద్రబాబు ఇప్పుడు సంక్షేమం కేంద్రంగా ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమంలో జగన్ ను మించి ఇస్తానని చెప్పటం..చెప్పినా..అందుకు అనుగుణంగా ఓటర్లను జగన్ నుంచి తన వైపు తిప్పుకోవటం చంద్రబాబు కు అంత సులువైన పని కాదు. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటాన్ని సీఎం జగన్ తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాలుగేళ్లుగా చెప్పిన పథకాలు అమలు చేస్తూ విశ్వసనీయను పెంచుకున్నారు. అదే సమయంలో చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బ తీసారు. చంద్రబాబు సహజంగా చెప్పే విజన్ కు భిన్నంగా ఈ మేనిఫెస్టో కనిపిస్తోంది. ఇప్పుడు సీఎం జగన్ బాటలోనే చంద్రబాబు అడుగులు వేస్తుండటం వైసీపీకి కలిసొచ్చే అంశం. సంక్షేమ పథకాల లబ్ది దారులే ప్రధాన ఓట్ బ్యాంక్ గా చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారు. ఇదే జగన్ కు అస్త్రంగా మారనుంది.












Click it and Unblock the Notifications